‘తెలంగాణాలోనూ ‘ఓట్‌ చోరీ’.. వారి భరతం పడతాం‘ | revanth reddy comments on vote chori in telangana | Sakshi
Sakshi News home page

‘తెలంగాణాలోనూ ‘ఓట్‌ చోరీ’.. వారి భరతం పడతాం‘

Aug 18 2025 2:54 PM | Updated on Aug 18 2025 3:29 PM

revanth reddy comments on vote chori in telangana

సాక్షి,హైదరాబాద్‌: ‘బీహార్‌లోనే కాదు.. తెలంగాణలో ఓటు చోరీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర చేసేవారి భరతం పడదాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఓట్‌ చోరీ అంశంలో తప్పు చేసినవారిని వదిలేసి..తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

 సోమవారం రవీంద్ర భా‌రతి వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  375వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌..రాహుల్‌ గాంధీ ఆరోపణలకు ఏడురోజుల్లో సమగ్ర అఫిడవిట్‌ సమర్పించాలన్న ఈసీ ఆదేశాలపైవిధంగా స్పందించారు.    

‘ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని  చెప్పాం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33  శాతంగా తేల్చాం. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం.

గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది.అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు.ఐదు నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం.బహుజనుల కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆ ధర్నాకు ఎందుకు రాలేదు? బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా?.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు.ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు?.నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించగలరా?. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు.

రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపండి.. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు.రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి.విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది.

విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకే.అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీది. దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది.

అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది.బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి…తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది.ఇది ఎంతవరకు న్యాయం. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement