
హైదరాబాద్: తనకు మంత్రి పదవిని ఆశజూపి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలపై పదే పదే విమర్శల చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిఓణ కమిటీకి చేరింది. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి ఖండించారు.
సోషల్ మీడియా జర్నలిస్టులను టార్గెట్ చేసి మాట్లాడటం సీఎం రేవంత్‌కు తగదని, దీన్ని తెలంగాణ సమాజం సహించదన్నారు. ఈ విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ‘ రాజగోపాల్‌రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించా. రాజగోపాల్ రెడ్డి వ్యవహరాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది’ అని స్సష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. ఇక మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై మహేష్ గౌడ్ స్పందించారు. మార్వాడీలు మనలో ఒక భాగమని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు.
మంత్రి పదవిపై ఉన్న మోజు అభివృద్ధిపై లేదు
యాదాద్రి భువనగిరి జిల్లా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న మోజు నియోజకవర్గం అభివృద్ధిపై లేదని విమర్శించారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. ‘ 20 నెలల్లో మునుగోడులో ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మేమే. ప్రభుత్వం సహకరిస్తలేదని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక్కసారైనా నియోజకవర్గం తీసుకొచ్చావా. మునుగోడుకు రాజగోపాల్ నేనే మంత్రి.. నేనే రాజు అని అనుకుంటున్నాడు. మంత్రులను ఎంపీలను ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నాడు..కలలో కూడా మంత్రి పదవి కోసం రాజగోపాల్ కలవరిస్తున్నాడు. మంత్రి పదవి ఫై ఉన్న మోజు ఈ ప్రాంత అభివృద్ధిపై లేదు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్నే విమర్శిస్తే నీకు నిధులు ఎవరు ఇస్తరు’ అని ప్రశ్నించారు.