
స్థానిక సంస్థల ఎన్నికలపై 23న పీఏసీ భేటీ
పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చించనున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే అధికార కాంగ్రెస్ కూడా 3 ఆప్షన్లను పరిశీలించనుంది. ఈ మూడు ఆప్షన్లలో ఎటువైపు మొగ్గుచూపాలనే అంశాన్ని తేల్చేందుకు ఈనెల 23న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో 3 అంశాలపై చర్చించి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని యోచిస్తోంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం.
ఎలా ముందుకెళ్దాం?
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదు. పీసీసీ చీఫ్‌తో పాటు పార్టీలోని బీసీ ముఖ్య నేతలు ఓ వాదన వినిపిస్తుండగా, కొందరు మంత్రులు, మరికొందరు నేతలు మరో వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే బీసీలకు 42 %రిజర్వేషన్ల కల్పనే పార్టీకి ప్రధానమని, అవసరమనుకుంటే ఈ విషయంలో మరికొంత సమయం తీసుకుందామని ఆయన అంటున్నారు.
ఆదివారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు మంత్రులు, నాయకులు మాత్రం ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మరింత జాప్యం చేయడం మంచిది కాదని, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పీఏసీని సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు.
ఈ మూడు ఆప్షన్లు పీఏసీ ముందుకు..
పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ జరగనుండగా.. రిజర్వేషన్ల విషయం ఎటూ తేలనందున కోర్టును మరింత సమయం కోరుదామని, వీలుకాదంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మరోమారు ఢిల్లీకి వెళదామనే ప్రతిపాదన ఇందులో మొదటిది.
మరోమారు అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టాలనేది రెండో ప్రతిపాదన. ఈ రెండూ కాదంటే నేరుగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడం మూడోది. వీటిపై అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
సీఎంతో ముఖ్యుల భేటీ
ఆదివారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌తో మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియన్ నేత వి.హనుమంతరావులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు గాం«దీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా 22న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగే అమరవీరుల స్థూపావిష్కరణకు హాజరు కావాలని రేవంత్‌ను వీహెచ్ కోరారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా పీసీసీ చీఫ్‌కు సూచించిన ముఖ్యమంత్రి.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని వీహెచ్‌కు చెప్పినట్టు సమాచారం.