breaking news
-
గొర్రెలు.. బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి?..తనకు కేటాయించిన శాఖలపై మంత్రి అసంతృప్తి
సాక్షి, కరీంనగర్ జిల్లా: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద ఇచ్చిన శాఖలపై శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి.ఇది అదృష్టమో, దురదృష్టమో తెల్వదు.పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉంది.ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయి.యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి..? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?అని వ్యాఖ్యానించారు. -
నీళ్ల విలువ తెలియని వ్యక్తులా మన నాయకులు.. హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్ రావు హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు. -
కొండారెడ్డిపల్లికి వస్తావా? కొడంగల్‌కు రమ్మంటావా?
సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు ఎవరు మంచి చేశారో చర్చిద్దాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రొటీన్‌గా రంకెలు వేస్తూ చాలెంజ్‌లు చేస్తున్నారు. ఆయన ముచ్చట తీర్చేందుకు బీఆర్ఎస్ తరఫున నేను సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి లేదా అయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో చర్చకు సిద్ధం. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంతూరు చింతమడక, ఆయన నియోజకవర్గం గజ్వేల్ అయినా సరే. అసెంబ్లీలో పెడతావో, అంబేడ్కర్ విగ్రహం దగ్గర పెడతావో చర్చ నీ ఇష్టం. వేదిక, తేదీ, సమయం అన్నీ సీఎం ఇష్టమున్నట్లుగా నిర్ణయించుకోవచ్చు. బేసిక్స్ కూడా తెలియని సీఎం.. చర్చకు ప్రిపేర్ అయ్యేందుకు 72 గంటల గడువు ఇస్తున్నా.లేదంటే ఈ నెల 8న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు మేమే వేదిక ఏర్పాటు చేసి సీఎం కోసం కుర్చీ వేసి ఎదురుచూస్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సవాలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ మినహా ఎవరూ సంతోషంగా లేరు. దండుపాళ్యం ముఠా రీతిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి దోచుకుంటూ హామీలు అమలు చేయడం లేదు. రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను ఏటీఎంగా మార్చి రేవంత్.. ‘పే సీఎం’లా తయారయ్యారు. చంద్రబాబు కోవర్టులా మారిన రేవంత్ ఇక్కడి నీళ్లను ఆంధ్రకు తరలిస్తున్నారు’అని మండిపడ్డారు. నిధులు ఢిల్లీకి.. నీళ్లు ఆంధ్రకు ‘తెలంగాణలో రైతు రాజ్యాన్ని తెచ్చి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దింది ఎవరో ప్రజలకు తెలుసు. అన్నీ తెలిసీ నిజం ఒప్పుకోకుండా నటించడం రేవంత్‌కు మాత్రమే తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదం స్ఫూర్తిని దెబ్బతీస్తూ నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీ కాంగ్రెస్‌కు మళ్లిస్తూ.. కొందరు తొత్తులను రేవంత్ పదవుల్లో నియమించుకున్నారు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అంటున్న రేవంత్‌కు కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడటమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా. ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడితే నికృష్టంగా ఉంది.మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని చెప్పి.. నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఎరువులను పంచడం కూడా చేతగాని సీఎం రేవంత్, చర్చకు కేసీఆర్ రావాలని సవాలు చేయడాన్ని చూసి జనం నవ్వుతున్నారు. నాలుగు పంటలకు గాను ఒక్క పంటకు ఒక్కసారి రైతుబంధు వేసి దానికి పండుగ చేసుకోమని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు. ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుంది. వంద అసెంబ్లీ సీట్లు వస్తాయని రేవంత్ పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ధర్మయుద్ధం ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధర్మ పాలన సాగుతోందని.. ఎన్నో హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్... ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ప్రజలను వంచించిన అధర్మ ప్రభుత్వంపై ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్‌రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అప్పుల కుప్పలు.. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సర్వనాశనం చేశాయి. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రాష్ట్రం పరువును బజారుకీడ్చింది. అప్పులపాలైందంటూ ప్రపంచమంతటా ప్రచారం చేస్తోంది. హామీలు అమలు చేయాలని అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రజలను మోసగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినప్పుడు హామీలు ఎందుకివ్వాలి? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్నివిధాలా సాయం అందిస్తోంది. 11 ఏళ్లలో రూ. 12 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచి్చంది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ దు్రష్పచారం చేస్తున్నారు. కేంద్రం ఏమి ఇచ్చిందో లెక్కలతో సహా వివరాలున్నాయి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’అని రాంచందర్‌రావు చెప్పారు. యూరియా కొరత పట్టదా? కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సదస్సు అంటూ బహిరంగ సభ పెట్టి ప్రధాని మోదీ, బీజేపీని తిట్టడాన్ని రాంచందర్‌రావు తప్పుబట్టారు. సామాజిక న్యాయమంటే మోదీని, బీజీపీని తిట్టడం కాదన్నారు. ఏడాదిన్నరలో ఏం చేశారో చెప్పకుండా చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని.. కేంద్రం దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల, అధికార యంత్రాంగం చేతులెత్తేయడం వల్ల రైతులకు యూరియా అందడంలేదని విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆలిండియా చీటింగ్ కమిటీ బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, కాంగ్రెస్ అధికారం కోసం, అవినీతి కోసం పనిచేసే పార్టీ అని రాంచందర్‌రావు ఆరోపించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి వచి్చన రెండేళ్లలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు... ఈసారి బీజేపీకి అవాకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ధర్మ యుద్ధం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంకు బహిరంగ లేఖ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయాలని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. -
కేటీఆర్.. మీరొక ఎమ్మెల్యే కదా! అసెంబ్లీలోనే చర్చిద్దాం
సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కు స్పందించే క్రమంలో.. 72 గంటల డెడ్‌లైన్ విధిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. మంత్రులు పొన్నం, సీతక్కతో పాటు పలువురు కీలక నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, సవాల్‌పై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. ‘‘కేటీఆర్ ఈ దేశంలో లేకపోవడం వల్ల మా సీఎం మాట్లాడింది తెలియనట్లు ఉంది. కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధం అన్నారు. కానీ కేటీఆర్ శాసన సభ కాదని ప్రెస్ క్లబ్‌కు రావాలని సవాల్ చేస్తున్నారు. అక్కడకు చర్చకు పిలవాల్సింది మీరు కాదు. మీరు (కేటీఆర్) ఒక ఎమ్మెల్యే. కాబట్టి అసెంబ్లీలోనే చర్చకు రండి. అంతకంటే ముందు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ చేత ముందు చర్చ కోసం స్పీకర్‌కు రాయించండి.సీఎం ఒక్క మాట మాట్లాడితే కేటీఆర్‌కు ఎందుకు అంత భయం?. మనం వీధుల్లో కోట్లాడుకునే వీధి మనుషులం కాదు. శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలం. అక్కడే చర్చిద్దాం రండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది. విదేశాలలో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిది. అసెంబ్లీ లో చర్చిద్దాం అంటే.. ప్రెస్ క్లబ్‌కు రమ్మనడం ఏంటి?. డెడ్ అయిన పార్టీ(బీఆర్ఎస్ను ఉద్దేశించి..) డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉంది. నీ సొంత చెల్లే(కవితను ఉద్దేశించి).. నిన్ను నాయకునిగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు(కేసీఆర్) అసెంబ్లీకి రాడా?. సమస్యల పై చర్చింద్దాం రా అంటే భయమెందుకు?.. అని అన్నారామె.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందిస్తూ.. కేటీఆర్ లండన్ లో బాగా రెస్ట్ తీసుకుని వచ్చి మళ్లీ రోస్టు మొదలుపెట్టారు. మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆడిపోసుకోవడమే ఆయనకు పనిగా మారింది. అక్కసు, కుళ్లు తప్ప కేటీఆర్ లో మాటల్లో ఏ మాత్రం పస లేదు. మా ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. మా ప్రభుత్వ పనితీరుపై ఎప్పుడైనా మేం చర్చకు సిద్దం.ప్రజాస్వామ్యంలో చర్చకు చట్ట సభలున్నాయి. అక్కడ జరిగే చర్చలు రికార్డు అవుతాయి. అసెంబ్లీలో చర్చకు రాావాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్దం. దమ్ముంటే స్పీకర్ దగ్గరకు వెళ్లి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కోరుతు మీ పార్టీ తరపున లేఖ ఇవ్వండి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకువచ్చి చర్చ చేయమనండి అని అన్నారు. -
పొన్నం.. రేవంత్‌తో రాజీనామా చేపించు: రామచందర్‌రావు
హైదరాబాద్, సాక్షి: పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ నిరంతరం అండగా నిలుస్తుందని, అందుకు తాను ఒక ఉదాహరణ అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు. అలాగే బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్రతీఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయని రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రాంచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనికి ముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ ఒకటేనని, తమ మధ్య అభిప్రాయ బేధాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని రాంచందర్‌రావు ఆరోపించారు. మతం ఆధారంగా తాము ఏ బిల్లును ఆమోదించబోమని, అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఏమైందని రాంచందర్‌రావు కాంగ్రెస్‌ను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేయలేక తప్పులను తమపై నెడుతున్నదన్నారు. ప్రతీసారి ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారన్నారు. లోకల్ బాడీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని రాంచందర్‌రావు ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయించాలని, అప్పుడు బీసీని సీఎం చేస్తే, తన పదవిని రాజీనామా చేస్తానని రాంచందర్‌రావు సవాల్ విసిరారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్ అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా?. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం’ అని చెప్పుకొచ్చారు. 18 నెలలుగా తెలంగాణ టైమ్ పాస్ పాలన నడుస్తుంది. మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు.. ఎక్కడికి పిలిచిన రెడీ. 72 గంటల సమయం రేవంత్‌కు ఇస్తున్నాం. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు, అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు. ప్రతీ మండలం లో ఎరువుల కోసం క్యూ లైన్ లో రైతులు ఎదురు చూసే పరిస్థితి. కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. రైతులకు రైతు భీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్..చంద్రబాబు బనకచర్ల ద్వారా తెలంగాణ రైతుల గొంతు కోస్తున్న మాట వాస్తవం. ఆంధ్రా ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారా రేవంత్?. బురద చల్లడం పక్కకు వెళ్ళడం రేవంత్‌కు అలవాటు. రుణ మాఫీ 12 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతులను, మహిళలను, కౌలు రైతులను మోసం చేసింది. 400 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. ఒక్క కొత్త పథకం ప్రారంభించ లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీకి మూటలు పంపించడం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం తప్ప రేవంత్‌కు మరో పని లేదు. రేవంత్‌కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు కోవర్టు రేవంత్. తెలంగాణలో జరుగుతుంది కోవర్టు పాలన’అని విమర్శించారు. -
తెలంగాణ తెచ్చుకుంది కడుక్కు తాగేందుకు కాదు
సాక్షి, హైదరాబాద్: ‘సుదీర్ఘ కాలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్కుని తాగేందుకు, కరిగించుకుని తినేందుకు కాదు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్న గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకులకు లేవు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో, నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పాలకులకు సాగునీటి రంగంపై అవగాహన లేకపోవడంతో జరుగుతున్న నష్టంపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.ఒకటి రెండు రోజుల్లో నేను స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తా’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పార్టీ నేతలతో అన్నారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగు నీటి రంగంపై ప్రస్తుత పాలకులకు కనీస అవగాహన లేదు. వారికి తోక తెలియదు.. మూతి తెలియదు. బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై నేనే స్వయంగా ఆదివారం (సూచనప్రాయంగా) మీడియాతో మాట్లాడతా. నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం డిశ్చార్జి అయిన తర్వాత నందినగర్ నివాసంలోనే ఉంటా’అని కేసీఆర్ తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ నేతలతో ఇష్టాగోష్టి తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బనకచర్లపై తన ప్రెస్‌మీట్ తర్వాత పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిరుమర్తి లింగయ్య, శంకర్‌నాయక్, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్, నాగేశ్, సతీశ్‌రెడ్డి తదితరులు ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. -
యుద్ధాన్ని ఆపేశారేం?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపేశారో, అసలు ఆపిందెవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయని గుర్తుచేశారు. అయినా యుద్ధం కొనసాగించకుండా అర్ధాంతరంగా నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.దేశానికున్న బలగంతో వీరోచితంగా పోరాడి పాక్ పీచమణిచి పీఓకేను స్వాదీనం చేసుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఖర్గే ధ్వజమెత్తారు. జబ్బలు చరుచుకునే మోదీ కి కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే చేతనవుతుందని విమర్శించారు. దేశరక్షణ, సైనికులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ఆయన దేశభక్తికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ‘గంభీరంగా కనిపిస్తున్నట్లు నటించే మోదీ నిజానికి అత్యంత భయస్తుడు. ప్రధాని మోదీ ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించారు. కానీ స్వదేశంలో అగి్నగుండంగా మారిన మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు. మణిపూర్ భారత్‌కు అత్యంత కీలకమైన ప్రదేశం. అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిశీలించేందుకు నేను, రాహుల్‌గాంధీ వెళ్లాం. బాధితులను పరామర్శించాం. మరి మోదీ ఎందుకు మణిపూర్ వెళ్లలేదు? వారు దేశ పౌరులు కాదా? దేశ ప్రజలను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ ప్రజలను మోదీ రోడ్లపై వదిలేశారు. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పిస్తామని చెప్పి చేసి చూపించారు..’ అని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే అందరికీ అభివృద్ధి ఫలాలు ‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆత్మ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతుభరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించలేరు.. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు 50కి పైగా కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డాయి. మరి మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏమిచ్చిందో చెప్పాలి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానన్న మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. కానీ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసేయలేరు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బందిగా ఉంటే బీజేపీ పార్టీ ప్రణాళిక నుంచి ఆ పదం తొలగించి చూపించాలి..’ అని ఖర్గే సవాల్ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం ‘తెలంగాణలో అధికార మదంతో తమకు తిరుగులేదనే అహంకారంతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు. కార్యకర్తల కృషితో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం..ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..’ అని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ‘అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతి శాఖలో ఒక సంక్షేమ పథకం ఉంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. ప్రజా ప్రభుత్వం ప్రతి హామీ అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కుల సర్వే హామీ ఇచ్చి అమలు చేసి చూపించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని జనగణనలో చేర్చింది. మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఇప్పించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేయిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. కోటిమంది మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్పించి కోటీశ్వరులుగా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను స్థాపించాం. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ కొందరు వెకిలిగా వ్యాఖ్యానించారు. కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. ఈ అంశంపై మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం..’ అని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. కార్యకర్తల ఎన్నికలొస్తున్నాయి.. ‘రాష్ట్రంలో నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. స్టేజిమీద ఉన్న నాయకుల ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. కార్యకర్తల గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తాం. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. బీఫామే ఇంటికి వస్తుంది..’ అని సీఎం అన్నారు. కాగా బహిరంగ సభ అనంతరం ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. -
‘మీలాంటోళ్లను చూసి భయపడం..’ టీపీఏసీ భేటీలో ఖర్గే వ్యాఖ్యలు
గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, సాక్షి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతాం అనుకుంటున్నారా?. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేనూ రాహుల్ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది. అందుకే పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలి’’ అని సున్నితంగా హెచ్చరించారు. మరో సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నేతలకు చురకలంటించారు. ‘‘కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మన ప్రతీ మూమెంట్ ప్రజలు గమనిస్తారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి కొత్త నష్టం చేస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. జిల్లాల వారీగా ఆశావహుల లిస్టును పీసీసీ సిద్ధం చేయాలి అని సూచించారు. ఈ మీటింగ్ వేదికగా.. పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే టీపీసీసీకి డెడ్ లైన్ విధించారు. ‘‘ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దే బాధ్యత’’ అని ఖర్గే అన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్ కలగజేసుకుని ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు టీపీసీసీ చీఫ్‌కు పంపాలని చెప్పారు. ఆ వెంటనే ఖర్గే మరోసారి ‘పార్టీలో పనిచేసిన వారికి.. అర్హత ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలి’’ అని సూచించారు. టీపీసీసీ విస్తృత స్థాయి, కార్యవర్గ సమావేశాల్లోనూ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ లో పరిపాలన బావుంది, పార్టీ కార్యకర్తల పనితీరు బావుంది. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలి. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ఖర్గే ప్రసంగించారు. జడ్చర్ల ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్ ఆగ్రహంజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీని పీసీసీ చీఫ్ ఆదేశించారు. సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రేవంత్.. నిరుద్యోగుల నిర్బంధం, అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు అంటూ విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా?. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్‌కు గద్దెనెక్కిన తరువాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తే లేదా?.చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే, ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గం. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించరు. ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం.ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి. లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతాం.. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం.. జై తెలంగాణ అని వ్యాఖ్యలు చేశారు. -
గాంధీ భవన్లో ఖర్గే.. సీఎం రేవంత్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జీ మీనాక్షీ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, పీఏసీ సభ్యులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఏసీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు.లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.కాగా, ఇవాళ పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
నిలకడగానే కేసీఆర్ ఆరోగ్యం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అస్వస్థతతో గురువారం సాయంత్రం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం, మధుమేహ సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(71) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన.. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో నిన్న నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఉండగా.. తాజాగా కూతురు-ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వైద్య బృందం ఇదివరకే ఉందని ప్రకటించింది. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించింది. అయితే.. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్న వైద్యులు.. కోలుకునేందుకు మరో రెండు రోజులు పట్టొచ్చని, అప్పుడే ఆయన్ని డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. KCR ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు, అధికారులతో స్వయంగా మాట్లాడిన సీఎం.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. మరోవైపు.. కేసీఆర్ అనారోగ్య వార్తలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలి వస్తున్నారు. -
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎలాంటి నిర్ణయమైనా సమష్టిగా చర్చించిన తర్వాతే తీసుకుంటామని, దాన్నిఅమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు. సొంతంగా, స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ‘పార్టీ ఎజెండా ముఖ్యం.. 2028లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై గురువారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అప్పుల గురించి రేవంత్‌కు అప్పుడు తెలియదా? ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నర కాలంలోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ అప్పుల గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ అప్పుల సంగతి ఆయనకు తెలియదా? కనీస అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అమలు చేయాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి చెబుతారా? రైతు రుణమాఫీ ఇంకా పూర్తికాలేదు. రైతుబంధు అందడం లేదు. మహాలక్ష్మీ, గృహలక్ష్మి అంటూ ఎన్నో హామీలు ఇచ్చి... ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ప్రజాస్వామ్య తెలంగాణ మాటలకే పరిమితమైంది. భైంసాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు. గోరక్షకులను అరెస్టులు చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. పదేళ్ల పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ను ప్రజలు వద్దనుకున్నారు. అందుకే కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ విధానాలనే అమలు చేస్తోంది. అందుకే కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటికీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితికి తగినట్లు బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారంలోకి వచ్చేలా కష్టపడతాం. ఒక్క ఎమ్మెల్యేతో మొదలుపెట్టి.. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో బలమైన పార్టీగా ఎదిగింది. గతంలో కేవలం మూడు, నాలుగు శాతం ఓట్లున్న ఈ పార్టీ..గత పార్లమెంటు ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో సగం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా ఏర్పడింది. గెలుపు గుర్రాలకే ‘స్థానిక’టిక్కెట్లు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జీహెచ్ఎంసీలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఉన్న వ్యతిరేకత మాకు కలిసివస్తుంది. త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తాం. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తాం. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లను చేర్చుకుంటాం. కొత్త నీరు వస్తేనే కదా ప్రవాహం పెరిగేది. టాలెంట్‌కు తగిన పదవులు కూడా ఇస్తాం. పాత, కొత్త నాయకులనే తేడా అస్సలు లేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటా.. రాష్ట్ర అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి పర్యటనలకే తొలి ప్రాధాన్యత. పార్టీ పరంగా మాకు 38 జిల్లాలున్నాయి. కార్యాలయానికే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. సమస్యలపై ఉద్యమాలు చేపడతా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ నినాదం ఉత్తమాటే. బీసీ బిల్లు ఇక్కడ రూపొందించి అక్కడ అమలు చేయడమనేది తెలివి తక్కువ చర్య. బిల్లు ఆమోదిస్తే గెజిట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బిల్లు తయారు చేసి కేంద్రాన్ని అమలు చేయమన్నది. మా ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ నెల 5 లేదా 10వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తా. -
సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్‌తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్‌రెడ్డి, ప్రేంసాగర్ రావు, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్‌కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్‌కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్ నుంచి రేవంత్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హోటల్‌కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్ విప్ ఆఫర్ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హోటల్ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
‘కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. వారితో సంబంధం లేదు’
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నిఅంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి అన్నారు. తమకు హరీష్ రావు, కేటీఆర్‌లతో సంబంధం లేదని, వారు తమ లెక్కల్లోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘ హరీష్‌రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలి. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం. కేసీఆర్‌తోనే లెక్క.. హరీష్‌రావు ఎవరో నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్‌రావు, కేటీఆర్‌లు,. కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్‌కు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు, కేటీఆర్‌లు కీలకం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్‌లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు మార్లు చంద్రబాబు తీరును బహిరంగంగానే విమర్శించారు. తాజాగా, మరోమారు అదే తరహాలో చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్ట్‌లు చూసేది బాబు కోవర్టులే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాయడం కాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు. -
‘నాడు బాబుకు బ్యాగులు మోసి బ్యాడ్‌మెన్.. నేడు బనకచర్ల బొంకుమెన్’
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్‌మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది.సీఎం రేవంత్‌కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్‌గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్‌కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్‌లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేసులో మేయర్ విజయలక్ష్మి?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్ల హడావుడి పెరిగింది. అన్ని కార్యక్రమాల్లోనూ తామున్నామంటూ ముందుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమంటూ సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలోని కమిషనర్‌ను, ఉన్నతాధికారులను కలుస్తున్నారు. తమ పరిధిలోని అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. త్వరితంగా చేయాల్సిందిగా తొందర పెడుతున్నారు. అంతే కాదు.. స్థానిక సమస్యలపైనా పాలకమండలి సమావేశాల్లో గళమెత్తుతున్నారు. అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నలతో అధికారులను ఇరుకున పెడుతున్నారు. బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే, వివిధ అంశాల్లో అవినీతిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వేయని రోడ్లకు బిల్లులు కాజేస్తున్నారంటూ ఇంజినీర్ల అక్రమాలను కళ్లకు కడుతున్నారు. నాలుగేళ్ల పాటు లేనిది.. గడచిన నాలుగేళ్లుగా లేని చైతన్యం ఇప్పుడే ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. త్వరలోనే వారి పదవీకాలం ముగియనుండటం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పాలక మండలికి దాదాపు ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. తిరిగి గెలవాలంటే ప్రజల్లోకి వెళ్లక తప్పదు. తీరా ఎన్నికలు వచ్చాక వెళ్తే ప్రజలు తిరగబడ్తారని, అభాసుపాలవుతారని తెలిసి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారమైతే తమకదే పదివేలంటున్నారు ప్రజలు. ఇది అందరి కార్పొరేటర్ల పరిస్థితి కాగా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ల పరిస్థితి ఇంకొంచెం భిన్నంగా ఉంది. అందుకు కారణం త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుండటమేనని చెబుతున్నారు. ‘జూబ్లీహిల్స్’పై కన్ను.. ఆ నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు సోమవారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉన్న యూసుఫ్‌గూడ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్‌తో పాటు రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల ఫిర్యాదులు ఓపికగా విన్నారు. జాప్యం లేకుండా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదివరకు లేని విధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువసేపు ఉంటున్నారు. మే యర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ కూడా పొరుగునే ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబో యే ఎన్నికల్లో తాను మళ్లీ కార్పొరేటర్‌గా పోటీ చేయ నని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీపై ఆమె చూపు ఉందేమో అనే వ్యాఖ్యానాలు సైతం వినిపిస్తున్నాయి. -
సంఘటితం.. సంఘర్షణ.. సిద్ధంచేయడం
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుపై మూడు ప్రధాన బాధ్యతలున్నాయి. కార్యకర్తలను సంఘటితం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంఘర్షణ చేయడం.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేలా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయడం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రకటన, సన్మాన కార్యక్రమంలో ఎన్.రామంచందర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శోభ కరంద్లాజే ప్రకటించి ఆయకు నియామకపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతోపాటు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఈ రెండింటికీ ప్రత్యామ్నాయమైన బీజేపీకి అధికారం ఇవ్వాలనే యోచనలో ప్రజలు ఉన్నారని.. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కేడర్‌కు సూచించారు. ‘తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచండి. అలా చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కాంగ్రెస్‌కు ఏటీఎంలుగా తయారయ్యాయి. ఇక్కడి ప్రజాధనాన్ని లూటీ చేసి పార్టీ పెద్దలకు కట్టబెడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజులు ఎంతో దూరం లేవు’అని పేర్కొన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి రూ. 12 లక్షల కోట్లు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని కొందరు తెలివితక్కువగా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలనంతా దోచుకోవడంతోనే గడిచిపోయిందని.. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా అందరూ ఐకమత్యంగా పనిచేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని.. తన హయంలో ఏమైనా లోటుపాట్లు జరిగితే క్షమించాలని కోరారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం: కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ రేస్ కేసుల్లో ఎలాంటి చర్యలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ రెండు పారీ్టలను నమ్మని ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. సౌమ్యుడిగా కనిపించినా సమస్య వస్తే టఫ్‌గా ఉంటా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సామాన్య కార్యకర్తలాగే కష్టపడి పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. అయితే తాను సౌమ్యుడిగా కనిపించినా సమస్య వచి్చనప్పుడు చాలా టఫ్‌గా వ్యవహరిస్తానన్నారు. సిద్ధాంతం కోసం పోరాడతానని, గతంలో 14సార్లు జైలుకు వెళ్లి వచ్చానని.. విద్యార్థుల కోసం లాఠీచార్జిలో తన చెయ్యి, కాలు దెబ్బతిన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. బీజేపీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుందని.. అందరి అభిప్రాయంతోనే తాను నిర్ణయాలు తీసుకుంటానని రాంచందర్‌రావు తెలిపారు. ఇప్పుడు అందరి లక్ష్యం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలోని కొత్త వాళ్లు, పాత వాళ్లు కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీతో, కాంగ్రెస్ ఫేక్ న్యూస్‌లతో ట్రోలింగ్ చేస్తోందని, అలాంటి వాటికి జడిసేది లేదన్నారు. పేరులేని పేపర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.జాతీయ కౌన్సిల్ సభ్యులు... రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనంతరం జాతీయ కౌన్సిల్‌కు ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వారిలో కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గోడం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పి.సుధాకర్‌రెడ్డి, ఎం.ధర్మారావు, చింతా సాంబమూర్తి, కె.గీతామూర్తి, పద్మజారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, బంగారు శ్రుతి, అరుణజ్యోతి, బండారు రాధిక, జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్, మర్రి శశిధర్‌రెడ్డి, పాయల్ శంకర్ ఉన్నారు. మరికొందరు నామినేషన్ వేసినప్పటికీ పేర్లను తర్వాత ప్రకటిస్తామన్నారు. -
బీఆర్ఎస్ కోసమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. ‘వాళ్లు (బీఆర్ఎస్) 2023లో ఓడిపోయారు. 2024లో డిపాజిట్లు కోల్పోయారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం సీఎంను, ఈ రాష్ట్రం సీఎంను భూతాలుగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నరు. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆయన (కేసీఆర్) ఫాంహౌస్‌లో కూర్చుని ఆలోచన చేస్తున్నడు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్‌రావులే.. తొమ్మిదిన్నరేళ్లు పాలనలో కేసీఆర్, హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న అంశంపై 2015 సెప్టెంబర్ 18న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సాగునీటి రంగ సలహాదారులు విద్యాసాగర్ రావు హాజరై ఏపీ 512 టీఎంసీలు వాడుకోవచ్చని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టి తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసి వచ్చారు. 2020లో కూడా సమావేశానికి వెళ్లి మళ్లీ సమ్మతి తెలిపారు. 2015లో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కేసీఆర్ వాదించలేదు. కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలనూ కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం’అని సీఎం బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాచపుండును పెట్టింది కేసీఆరే.. ‘ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని 2016 సెపె్టంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారి నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతే మిగులు జలాలు, వరద జలాల లభ్యత ఎంతో లెక్క తేలుతుంది. ఆ తర్వాతే ఆ జలాల్లో దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఏటా 3,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోందని కేసీఆర్‌కు ఏ దేవుడు చెప్పిండు? లేని ఏకును, రాచపుండును పెట్టిందే కేసీఆర్. దాని ఆధారంగానే గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు డీపీఆర్ తయారు చేయించడానికి చంద్రబాబు 2016లో జీవో ఆర్టీ నం.262 జారీ చేశారు. దీనికి కొనసాగింపుగా 2019 సెపె్టంబర్ 29న జీవో ఆర్టీ నం.230 ఇచ్చారు. వ్యాప్కోస్ 4 ప్రత్యామ్నాయాలు సూచించగా, 4వ ప్రత్యామ్నాయంగా 400 టీఎంసీలు తరలించవచ్చని నివేదిక ఇచి్చంది. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీలను తరలిస్తామని చూపించడం తాత్కాలికం. ప్రీఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం 300 టీఎంసీల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదనంగా 100 టీఎంసీల పంపులను ఫిట్ చేయడం లేదు. 400 టీఎంసీలను నెల్లూరు, ప్రకాశంకు ఎలా తీసుకెళ్లాలో 2016లోనే కేసీఆర్ చెప్పిండు. ఇదే అదనుగా చంద్రబాబు పనులు మొదలు పెట్టిండు. 2019లో జగన్ సీఎం కాగానే గోదావరి జలాలను ఏ విధంగా పెన్నాకు తరలించాలో ఆయనకు కేసీఆరే నేర్పిండు. కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి గోదావరి జలాలు మీకిచ్చి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నాడు. 2016–19 మధ్యలో కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు’అని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వివాదం సృష్టిస్తోందని విమర్శించారు. నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ను బతికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని తెలిపారు. -
‘రేవంత్.. మీకు, మీ హైడ్రాకు ఇవేమీ కనబడవు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్‌లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్‌లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.మిస్టర్ రేవంత్ రెడ్డి, ⭕️ నువ్వు కొడంగల్‌లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు ⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు ⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు ⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025 -
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని.. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.కాగా, రాజాసింగ్ తీసుకున్న సంచలన నిర్ణయం.. తెలంగాణ బీజేపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా.. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా.. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు.