
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం అంశంలో హరీశ్, సంతోష్‌రావుల పాత్ర
మెఘా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంది.. వారి వెనుక సీఎం రేవంత్ ఉన్నారు..
వారిని కాపాడుతూ కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు
నాన్నపై సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత?
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత పక్కన ఉంటూ ఆయన పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారు చేసిన చెత్త పనుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావుతో పాటు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేజర్ పాత్ర ఉన్నందునే ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును రెండోసారి ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరంగా పెట్టారన్నారు. అమెరికా పర్యటన నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు పోతుంది?
‘కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి, ఆయనపై ఆరోపణలు రావడానికి కారకులెవరో బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచిస్తే.. వీళ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొంత వనరులు, ఆస్తుల కోసం ఆలోచించారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తి కేసీఆర్ వైపు వేలెత్తి చూపి సీబీఐ విచారణ జరుపుతా అనేందుకు కారకులు ఎవరు? హరీశ్‌రావు, సంతోష్‌రావు నా మీద వ్యక్తిగతంగా అనేక కుట్రలు చేసినా ఇన్నాళ్లూ పేరు పెట్టి విమర్శించలేదు. కానీ ఇలాంటి వారిని మోస్తూ పోతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? బీఆర్‌ఎస్ నాయకులకు కోపం వచ్చినా చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు..’అని కవిత అన్నారు.
నన్ను విమర్శిస్తే ఖబడ్దార్!
‘హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉంటూ వాళ్లను అన్ని విషయాల్లో కాపాడుతూ కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెడుతున్న అవినీతి అనకొండలను ఏమీ అనడం లేదు. అంతర్గతంగా వారి నడుమ ఉన్న అవగాహన బయటకు రావాలి. నన్ను.. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని రేపటి నుంచి సోషల్ మీడియాలో విమర్శిస్తే ఖబడ్దార్.
నేను ఎవరో చెప్తే ఆడే తోలు»ొమ్మను కాను. నాది కేసీఆర్ రక్తం. స్వతంత్రంగా నేను అనుకున్న విషయాలను చెప్తా. రాజకీయంగా నాకు జరిగే కష్టం, నష్టాన్ని భరించేందుకు సిద్ధం. మా నాన్నకు లేఖ రాసిన నాటి నుంచి నాకు నరకం చూపిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ అంటే కడుపు రగులుతోంది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిజాం బాటలోనే నడుస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా నాన్న పరువు పోతే నాకు బాధ. కానీ మీకు మాత్రం డబ్బులు కావాలి. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి. బీఆర్‌ఎస్ నాయకులు తిట్టుకున్నా, స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అనుకున్నా సరే. మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత?
ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం
ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతారు.. మరోసారి గెలుస్తారు. ఇలాంటి దుర్మార్గుల వల్లే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులు, టీవీలు, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం. కేసీఆర్‌పై పీసీ ఘోష్ కమిషన్లు, సీబీఐ విచారణలు వేస్తే తెలంగాణ బంద్‌కు పార్టీ పిలుపునివ్వాలి కదా? కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించారు.
నేను చెప్పిన పేర్లు ఉన్న వారితో రేవంత్‌కు అవగాహన లేకపోతే వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ పేరు చెప్పుకోనిదే రేవంత్‌కు పూట గడవడం లేదు. వాస్తవానికి కేసీఆర్‌కు తెలంగాణ తప్ప.. తిండి, డబ్బు ధ్యాస ఉండదు. విచారణ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’అని కవిత పేర్కొన్నారు.