
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం
ప్రకటన విడుదల చేసిన పార్టీ నేతలు
హరీశ్, సంతోష్‌పై వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్
ఆమె తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందనే అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. బీఆర్‌ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీఆర్‌ఎస్ అధిష్టానం భావించింది. కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్..ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్!
మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ, సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం నేపథ్యంలో కవిత చేసిన ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సోమవారం అర్ధరాత్రి వరకు ఎర్రవల్లి నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. పార్టీ ప్రయోజనాలు, కేడర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కవితపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించినట్లు సమాచారం. ఇకపై కవిత చేసే ఆరోపణలు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని ఏకతాటిపై నడిపించడంపై దృష్టి కేంద్రీకరించాలని కేటీఆర్‌ను ఆదేశించినట్లు సమాచారం.
కేసీఆర్ ప్రజల సొత్తు అంటున్న నేతలు
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలు స్వాగతించారు. కేసీఆర్ ఎవరి సొత్తూ కాదని, కవితతో పాటు పార్టీ కేడర్‌కు ఆయన తండ్రి లాంటి వాడని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. పార్టీ కోసం కన్నబిడ్డను కూడా వదులుకున్న నేత కేసీఆర్ అంటూ పలువురు నాయకులు కొనియాడారు.
కేసీఆర్ ప్రతిష్టపైనే బీఆర్‌ఎస్ మనుగడ, 60 లక్షల మంది కేడర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయాన్ని కవిత మరిచిపోయి విమర్శలు చేశారంటూ పలువురు నేతలు ప్రకటనలు విడుదల చేశారు. కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చేలా ఆమెను ఎవరో మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కవిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కేసీఆర్‌కు, పార్టీకి బాధ కలిగించే అంశమైనప్పటికీ సస్పెన్షన్ తప్పనిసరి అని పార్టీ అధినేత భావించారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.