షాకులిచ్చిన కవితకే బిగ్‌ షాక్‌! | BRS Chief KCR Big Shock To Daughter Kavitha | Sakshi
Sakshi News home page

షాకులిచ్చిన కవితకే బిగ్‌ షాక్‌!

Sep 2 2025 3:56 PM | Updated on Sep 2 2025 5:42 PM

BRS Chief KCR Big Shock To Daughter Kavitha

గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్‌ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. 

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్‌ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్‌పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్‌ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. 

కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తీహార్‌ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్‌ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.

షాక్‌ నెంబర్‌ 1..
పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్‌ఎస్‌ సస్లివర​ జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్‌ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్‌ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.

షాక్‌ నెంబర్‌ 2.. 
పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్‌ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్‌ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.

షాక్‌ నెంబర్‌ 3..
కాళేశ్వరం కమిషన్‌ కేసీఆర్‌కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్‌ 10వ తేదీన ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారామె.  అయితే  ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పూర్తిగా దూరంగా ఉంది. 

షాక్‌ నెంబర్‌ 4..
జూన్‌ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్‌ రేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. ‌

షాక్‌ నెంబర్‌ 5..
జులైలో.. జహీరాబాద్‌లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్‌కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్‌ఎస్‌ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది.  

షాక్‌ నెంబర్‌ 6..
బీఆర్‌ఎస్‌ కేడర్‌ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది.  జులై 26వ తేదీన ఉప్పల్‌లో కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. 

షాక్‌ నెంబర్‌ 7..
పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారు

షాక్‌ నెంబర్‌ 7..
ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిన లిల్లీపుట్‌ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. 

షాక్‌ నెంబర్‌ 8.. 
కాళేశ్వరంపై బాంబ్‌ పేల్చారామె. హరీష్‌రావు, సంతోష్‌ రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. 

ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్‌ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్‌ఎస్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్‌ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్‌ఎస్‌లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement