
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు(శుక్రవారం) తెలంగాణలో పర్యటిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కవితలాంటి అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు అని ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్, వన్ నేషన్.. వన్ లా, వన్ నేషన్.. వన్ ట్యాక్స్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పన్ను వ్యవస్థను సరళీకరణ చేయడం హర్షణీయం. మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్నుల భారం తగ్గింపు నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షాను టీబీజేపీ నేతలు కలుస్తారు.. ఈ సమావేశంపై కొద్దిసేపట్లో క్లారిటీ వస్తుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో తెలంగాణ బీఆర్‌ఎస్ రాజకీయాలు, కవిత ఎపిసోడ్‌పై రామచందర్ రావు స్పందిస్తూ..‘కవిత విషయంపై మాట్లాడాల్సిన అవసరం లేదు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఎటువంటి లోపం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.