
వ్యక్తిగత లబ్ది కోరుకునే కొందరు పార్టీ నుంచి తనను బయటపడేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదు. ప్రతీ సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. ఆయన బీజేపీతోనూ టచ్‌లో ఉన్నారు.
హరీషన్నపై మొదటిరోజు మీడియాలో ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి హరీష్‌రావు పేరు కనిపించదు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఏనాడూ హరీష్‌రావు గురించి మాట్లాడలేదు. మ్యాచ్‌ఫిక్సింగ్ జరగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?. రేవంత్‌రెెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.
హరీష్‌రావు మొదటి నుంచి బీఆర్‌ఎస్ లేరు. పార్టీ మనకెందుకు మామా అని కేసీఆర్‌కు చెప్పి.. వ్యాపారం చేసే ఆలోచన కూడా చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 8, 9 నెలలకే చేరారు. పార్టీకి వెన్నుపోటు పొడుదాం అని గతంలోనూ ఆయన అనుకున్నారు. కేటీఆర్‌ను బతిమాలి పార్టీలో కొనసాగారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ మేకర్. ఆయనే సమస్య సృష్టించి.. ఆయనే మాఫీ చేసినట్లు నటిస్తారు. ఎలాగైనా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు.
హరీష్‌రావును నమ్ముకుని మైనంపల్లి, ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో పార్టీని వీడారు. 2018 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి డబ్బులనే 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండ్‌గా పంచారు. ఆయన ఫండింగ్ వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను(కేటీఆర్‌ను ఉద్దేశించి.) ఓడించడానికి హరీష్ కుట్ర చేశారు. సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. ‘‘ఓ హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. తర్వాత మీ వంతే. రామన్న.. మళ్లీ రేపు మీపై కూడా కుట్ర జరగొచ్చు’’ అని అన్నారామె.
సంతోష్‌రావు అనే వ్యక్తి చెప్పులో రాయి.. చెవిలో జోరీగా టైప్ అని అభివర్ణించారు. సంతోష్‌కు ధనదాహం చాలా ఎక్కువ. హరిత హరం పేరిట సినిమా హీరోలతో ఫోజులిప్పించి.. అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు పెట్టింది. చేయించింది అంతా సంతోష్‌రావు.. పేరు మాత్రం కేటీఆర్‌కు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారు?. సంతోష్‌రావు క్లాస్‌మేట్ కావడమే అందుకు కారణం. సంతోష్‌రావు వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నన్ను చూపించడం లేదు. సంతోష్, హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. హరీషన్న, సంతోషన్నలు మేకవన్నె పులులు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుంది’’ అని కవిత అన్నారు.
