
సాక్షి, హైదరాబాద్: పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారాలు చేశారని, ఎంతో బాధ ఉంటేనే తాను ఇలా మాట్లాడుతున్నానని బీఆర్‌ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి బీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కుటుంబ వ్యవహారంపైనా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
భవిష్యత్తు గురించి కాదు.. నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా. విచారణ లేకుండా, వివరణ తీసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. కోట్ల మందిలో ఒక్కరు కేసీఆర్. అలాంటి వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం. ఆయన చిటికెన వేలు పట్టుకునే ఉద్యమంలో నడిచా. అలాంటి వ్యక్తిపై నాకెందుకు కోపం?. పార్టీ జాగ్రత్త అనే రామన్నకు ఇప్పుడు కూడా చెబుతున్నా.
నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏమైంది, ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా. నాకైతే అనుమానమే? అని కవిత అన్నారు.
ఎంత పెద్ద నేతలైనా కొంత ఒత్తిడి ఉంటుంది. కేసీఆర్‌పైనా ఇప్పుడు అలాంటి ఒత్తిడే ఉండి ఉంటుంది. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. కానీ, ఎంత బాధ కలిగి ఉంటే నేను ఇలా మాట్లాడుతా. కుటుంబంలో ఎన్నో అవమానాలు జరిగాయి. కానీ, అవన్నీ చెప్పుకోలేను. అందుకే పార్టీ పరంగా ఉన్న సమస్యల గురించే మాట్లాడా. నిజాయితీని నిరూపించేందుకు రాజీనామా చేశా. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నందుకు బాధగా లేదు. రాజకీయంగా పొరపచ్చాలు ఇవాళ ఉంటాయి.. రేపు తొలగిపోతాయి. కానీ, మా అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే నన్ను బాధిస్తోంది అని అన్నారామె.
ఈ క్రమంలో.. కుటుంబ కలహాలను ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, పోస్టుల గురించి ఆమె స్పందించారు. ఎవరెవరితోనో నన్ను పోలుస్తూ కొందరు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. పనీపాటా లేని వాళ్లే అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్లు చేసేవాటికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారామె.