
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ కుమార్తె కవిత రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో వారి నుంచి పార్టీని కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడాలని ఆవేదనతో చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు ఎదరుచూస్తున్నారు. నాపై కుట్రలు జరిగాయి. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు.
బంగారు తెలంగాణ అవుతుందా?
కేసీఆర్‌పై నాకెందుకు కోపం. నా తల్లితో నేను మాట్లాడలేకపోతున్నాను. అదే నా బాధ. తల్లితో మాట్లాడకుంటే ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా?.
నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. నాన్న.. ఇప్పటికైనా మేలుకోండి. నాన్న, రామన్నా.. జాగ్రత్తగా ఉండండి. పార్టీని కాపాడండి’ అని వ్యాఖ్యలు చేశారు. చివరగా.. జై కేసీఆర్, జై తెలంగాణ అని నినాదం ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వర్గాలతో మాట్లాడి, భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
