
మీడియా సమావేశంలో రాజీనామా పత్రాలను చూపుతున్న కవిత
హరీశ్‌రావు, సంతోష్‌రావు కుట్ర చేస్తున్నారు
మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత
హరీశ్, సంతోష్ మేక వన్నె పులులు..
మా కుటుంబం, తెలంగాణ మంచి కోరుకునే వాళ్లు కాదు
వాళ్లను పక్కన పెడితేనే పార్టీ బతికి బట్ట కడుతుంది
నన్ను పార్టీ నుంచి బయటకు పంపి బలి చేశారు..ఇది ఇంతటితో ఆగదు
నాన్న కేసీఆర్‌కు, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది
మా కుటుంబం విచ్ఛిన్నమైతే వారికి అధికారం వస్తుంది కాబట్టే కుట్ర
హరీశ్.. సీఎం రేవంత్ కాళ్లు పట్టుకున్న నాటి నుంచే కుట్రలు మొదలు
నాపై కుట్రల విషయం ప్రెస్‌మీట్ పెట్టి చెప్పినా రామన్న స్పందించలేదు
హరీశ్ వల్లే ఈటల, జగ్గారెడ్డి తదితరులు పార్టీ వదిలి వెళ్లారు
కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరుకుంటున్నానన్న కవిత
నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి అంటూ హితవు
ఎమ్మెల్సీ పదవికి, బీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీశ్‌రావు, సంతోష్‌రావు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు..’ అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ‘నాన్నా.. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి. నేను కూడా మీలా ముక్కుసూటి మనిషిని కాబట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపి బలి చేశారు. రేపు మీకూ, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది..’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
మా కుటుంబం బాగుండటం వారికిష్టం లేదు..
కేసీఆర్, కేటీఆర్‌తో నాది కుటుంబ, రక్త సంబంధం. పదవులు, పార్టీతో ముడిపడిన బంధం కాదు. కానీ పార్టీలో ఉంటూ డబ్బులు సంపాదించుకుని వ్యక్తిగత లబ్ధి పొందాలని భావించే వ్యక్తులకు మేము బాగుండటం ఇష్టం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది కాబట్టి నన్ను బయటకు నెట్టారు. ఇది ఇంతటితో ఆగదు అని దైవ సమానులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా.
వారిళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా?
నాకు జన్మనిచ్చి, ప్రాణభిక్ష పెట్టిన నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నేను సామాజిక తెలంగాణ కోరుకోవడం కొందరికి నచ్చలేదు. హరీశ్‌రావు, సంతోష్ నాపై పనికట్టుకుని సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నట్లు ప్రచారం చేశారు. హరీశ్, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నేను అక్రమ కేసుల్లో తీహార్ జైలులో ఐదు నెలల పాటు గడిపి బయటకు వచ్చిన తర్వాత 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతితో గులాబీ కండువా కప్పుకుని అనేక ప్రజా సమస్యలు, అంశాలపై పోరాటం చేశా.
వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన
నా మీద జరుగుతున్న కుట్రల విషయంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదు. మీ చెల్లి, మహిళా ఎమ్మెల్సీని అయిన నాపై కుట్రలు జరుగుతున్నాయంటే ‘బేటా ఏమైంది?’ అని నాకు ఫోన్ చేయరా? కేసీఆర్ నుంచి నేను స్పందన కోరుకోలేదు, కానీ మీరు స్పందించాలి కదా. రామన్నా.. నా మీద ఎవరేం చెప్పారో తెలియదు. నా ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్‌కు హాని జరగాలని కోరుకునే ఆడపిల్లను కాదు. ఎన్ని జన్మల పుణ్యముంటే కేసీఆర్ లాంటి తండ్రి నాకు దొరికాడు. కానీ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన.
రేవంత్‌తో అవగాహన వల్లే వారిపై కేసులు మాఫీ
హరీశ్‌రావు, సంతోష్‌ల అవినీతి వల్లే మా నాన్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చింది. హైదరాబాద్– ఢిల్లీ విమాన ప్రయాణంలో సీఎం రేవంత్‌ను హరీశ్ కలిసి కాళ్లు పట్టుకున్న నాటి నుంచి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మొదలయ్యాయి. హరీశ్‌రావుకు సంబంధించిన పాల వ్యాపారం, రంగనాయక సాగర్ వద్ద భూ ఆక్రమణలు, మాజీ ఎంపీ సంతోష్‌పై మద్యం షాపుల కేసు తదితరాలన్నీ రేవంత్‌తో ఉన్న అవగాహన వల్లే తెరమరుగయ్యాయి. హరిత హారానికి నకిలీ కార్యక్రమం గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట సినీ నటులను మోసపూరితంగా రప్పించి అటవీ భూములను కొల్లగొట్టేందుకు సంతోష్ ప్రయత్నించాడు.
శ్రవణ్‌రావుతో కలిసి మా ఫోన్లు ట్యాప్ చేయించారు
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ అనుచరుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మోకిలలో రూ.750 కోట్ల బ్లూఫిన్ విల్లా ప్రాజెక్టు చేస్తున్నారు. సంతోష్‌ను మరో ఎమ్మెల్సీ నవీన్‌రావు తన గురువుగా చెప్పుకుంటున్నాడు. ఏసీబీకి వీరి అడ్రస్‌లు దొరకడం లేదా? రేవంత్ ప్రభుత్వంపై బరిగీసి కొట్లాడుతున్నందుకే మా కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయి. శ్రవణ్‌రావుతో కలిసి హరీశ్‌రావు, సంతోష్.. నా సిబ్బందితో పాటు కేటీఆర్, కేసీఆర్ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. హరీశ్, సంతోష్ మీతో బాగున్నట్లు నటించవచ్చు. కానీ వాళ్లు మన కుటుంబం, తెలంగాణ మంచి కోరుకునే వారు కాదు. వాళ్లను పక్కన పెట్టి కార్యకర్తలను అక్కున చేర్చుకుని ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ బతికి బట్ట కడుతుంది.
ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్
హరీశ్ టీఆర్‌ఎస్ ఆరంభం నుంచి లేరు. టీడీపీ నుంచి కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వస్తున్న సమయంలో రూ.కోటిన్నరతో వ్యాపారం చేసుకునేందుకు వెళ్లారు. 10 నెలల తర్వాత తిరిగి వచ్చిన హరీశ్‌ను క్షమించిన కేసీఆర్.. ఆయన ఎమ్మెల్యే కాకమునుపే మంత్రి పదవి ఇచ్చారు. హరీశ్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే ట్రబుల్స్ సృష్టించి వాటిని పరిష్కరించినట్లు చెప్పుకుంటారు.
కేసీఆర్, కేటీఆర్‌ను ఓడించాలని హరీశ్ చూశారు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావు 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ నిధితో పాటు అదనపు నిధులు కూడా ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన సొమ్ముతో తన మనుషులు కొందరు ఎమ్మెల్యేలుగా ఉండాలనుకున్నారు. 2009లో కేటీఆర్‌ను ఓడించేందుకు హరీశ్ రూ.60 లక్షలు పంపారు. కేసీఆర్‌ను కూడా గజ్వేల్‌లో ఓడించాలని చూశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి నన్ను ఓడించారు. ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని నన్ను బయటకు పంపితే పార్టీ బాగు పడుతుందా?
రామన్నా ఆరడుగుల బుల్లెట్‌తో జాగ్రత్తగా ఉండండి..
ఈ రోజు నన్ను గాయపరిచిన ఆరడుగుల బుల్లెట్..రేపు కేసీఆర్, కేటీఆర్‌లో ఎవరిని గాయపరుస్తుందో? రామన్నా జాగ్రత్తగా ఉండండి. హంపిలో భేటీ అయిన కొందరు నేతలు అవమానకరంగా మాట్లాడి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన సందర్భంలో కేటీఆర్ చేతులు పట్టుకుని హరీశ్ బ్రతిమిలాడారు. అక్కడ మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపారు.
అందులో భాగంగానే ఈటల రాజేందర్ బయటకు వెళ్లారు. హరీశ్ వల్లే జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, రఘునందన్‌రావు, విజయశాంతి, విజయ రామారావు తదితరులు పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో హరీశ్ వల్లే బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది.
కొందరి ఒత్తిడి వల్లే సస్పెన్షన్
పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత? అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. కంప్యూటర్‌లో బీఆర్‌ఎస్ హార్డ్‌వేర్ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్‌వేర్. తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ అభివృద్ధిలో నా కంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్‌పై కొందరు ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారని నమ్ముతున్నా. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తా. అయితే నా లేఖను లీక్‌ను లీక్ చేసిన వారిపై వంద రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు.
కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నారనే సమాచారాన్ని కూడా లీక్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. నా కుటుంబంలో జరిగిన అనేక అంశాలు బయటకు చెప్పలేను. రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతున్నా. నిజానికి నా లేఖ లీక్ కానంత వరకు నేను మాట్లాడలేదు. భవిష్యత్తులో అవసరమైన మరిన్ని విషయాలు బయట పెడతా. హరీశ్‌రావు, సంతోష్ మేక వన్నె పులులు. వాళ్లను పార్టీలో కొనసాగిస్తే నష్టం జరుగుతుంది.
ఏ పార్టీలోనూ చేరడం లేదు..
నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మేధావులు, బీసీలు, సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. రాఖీ పండుగ ముందు మెసేజ్ పెట్టినా రామన్న బిజీగా ఉండటంతో కుదరలేదు. కేసీఆర్ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరుకుంటున్నా.