
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి మాజీ మంత్రులు
బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 60 మంది కీలక నేతలు
ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాను వడపోస్తున్న వైనం
పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌చార్జీలతో కేటీఆర్ ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు.
స్థానిక కేడర్‌తో సమన్వయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా, మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్‌పేట, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు.
వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్యనేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ముఖ్యనేత తమతోపాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్‌లలో ప్రచారం చేస్తున్నారు.
అలాగే, బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలివచ్చినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్‌ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. భారీగా నకిలీ ఓటర్లు నమోదయ్యారని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ ఓటరు జాబితాను వడపోస్తూ అసలైన ఓటర్లను చేరుకోవాలని భావిస్తోంది.
సాదాసీదాగా నామినేషన్
నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగేలా బీఆర్‌ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈ నెల 19న మరో సెట్ దాఖలు చేయనున్నారు. 19న భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.