
‘జూబ్లీహిల్స్ ఉపఎన్నిక’పై బీఆర్‌ఎస్ ఫోకస్
డివిజన్ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్
ఇప్పటికే ఆరు డివిజన్లకు ఇన్‌చార్జ్‌లుగా కీలక నేతలకు బాధ్యతలు
వరుస సర్వేలతో పార్టీలు, ఆశావహుల బలాబలాలపై మదింపు
బిహార్ ఎన్నికలతోపాటు
ఉప ఎన్నిక జరుగుతుందని అంచనా
సాక్షి, హైదరాబాద్ : బిహార్ శాసనసభ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతుందని బీఆర్‌ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీతో నవంబర్‌లో ఎన్నిక జరుగుతుందని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్‌ఎస్ ఉప ఎన్నిక దిశగా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయ డంపై దృష్టి సారించింది. ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మున్సిపల్ డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక భేటీలు నిర్వహిస్తున్నారు.
బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యేలోపు పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించాలని కేటీఆర్ ఆదేశించారు. మైనారిటీ ఓటర్లకు చేరువయ్యేందుకు డివిజన్ల వారీ గా కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ‘ఓట్ చోరీ’ఎక్కువ మొత్తంలో ఉంటోందనే అనుమానంతో ఓటరు జా బితాలోని ప్రతీ ఓటరు పూర్వాపరాలను పరిశీలించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీ వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున సమన్వయకర్తను నియమించడంపై కసరత్తు జరుగుతోంది.
నిరంతర సర్వేలతో మదింపు
ఉప ఎన్నికలో సొంత పార్టీ బలంతోపా టు ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, బీజేపీ బలాబలాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు బీఆర్‌ఎస్ క్రమానుగత సర్వేలు నిర్వ హిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే అంశంపై నిర్వహించిన అంతర్గత సర్వేలో మాగంటి సునీత అభ్యరి్థత్వం వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సునీత అభ్యరి్థత్వాన్ని కేసీఆర్ దసరా తర్వాత ప్రకటించనున్నా రు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ 43.94% ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 35.03%, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి 14.11%, ఎంఐఎం అభ్యర్థి ఫరాజుద్దీన్ 4.28% ఓట్లు సాధించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు 50,83%, బీజేపీకి 36.65%, బీఆర్‌ఎస్‌కు 10.43% ఓట్లు పోల య్యాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటును ఒడిసి పట్టేలా కార్యాచరణకు బీఆర్‌ఎస్ పదును పెడుతోంది.
మాగంటి భార్య సునీతకే అవకాశం!
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన సోదరుడు వజ్రనాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి అభ్యరి్థత్వాలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. చివరకు మాగంటి భార్య సునీత అభ్యరి్థత్వానికే కేసీఆర్ మొగ్గు చూపడంతో క్షేత్రస్థాయిలో ఆమె చురుగ్గా పర్యటిస్తున్నారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న డివిజన్ల వారీగా పార్టీ సమావేశాల్లోనూ సునీత పాల్గొంటున్నారు. మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కూడా తల్లి వెంట డివిజన్లలో పర్యటిస్తూ సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
పార్టీ కేడర్‌ను ఉప ఎన్నిక దిశగా సన్నద్ధం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్లకు పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు (రహమత్‌నగర్), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (యూసుఫ్‌గూడ), దాసోజు శ్రవణ్ (షేక్‌పేట) డివిజన్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ (బోరబండ), ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (వెంగళరావునగర్), కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (ఎర్రగడ్డ) డివిజన్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు.