
హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి పలువురు నేతలు బయటకి వచ్చింది కేసీఆర్, కేటీఆర్ వల్లేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కవిత చెప్పినట్లు హరీష్‌రావు వల్ల ఎవరూ పార్లీని వీడలేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్‌ల వల్లే పార్టీనే వీడారన్నారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 4వ తేదీ) సాక్షి టీవీతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ‘కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చాను. కంట్రోల్ మొత్తం కేసీఆర్, కేటీఆర్ చేతిలోనే ఉంది. కవిత ఏమైనా సుద్ధపుసనా.. ఆమె అవినీతి చేయలేదా?, కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్‌దే.
హరీష్ కూడా కేవలం సంతకాలు చేయడానికే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఒక్కటే సీబీఐకి ఇచ్చారు. కాళేశ్వరం మొత్తం సీబీఐకి ఇవ్వాలి . కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్ట్ కడతానని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రాణహిత జలాలు చేవెళ్ల వరకు తేవడం తెలివి తక్కువతనమే. ఎకరాకు రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి చేవెళ్ల కు నీళ్ళిచ్చే బదులు... చేవెళ్ల రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల రైతుబంధు ఇవ్వాలి’ అని అన్నారు.