లారీ చోరీ చేసి..కరోనా పరీక్షకు

Young Man Steals Truck And Goes For Corona Test In Tamil Nadu - Sakshi

సాక్షి, తమిళనాడు ‌: చెన్నై నుంచి రావడంతో బంధువులు ఇంట్లోకి అనుమతి నిరాకరించిన స్థితిలో యువకుడు ఒకరు లారీని చోరీ చేసి కరోనా పరీక్షకు వెళ్లాడు. తిరువారూరు జిల్లా తిరుత్తురై పూండి ఉప్పుకుళ వీధికి చెందిన రామకృష్ణన్‌ గత మూడో తేదీన తిరుత్తరై పూండి– వేదై రోడ్డులోని లారీ యజమానుల సంఘం భవనం సమీపాన నిలిపి ఉంచిన ఇతని లారీ చోరీకి గురైంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న డీఎస్పీ పళణిస్వామి, ఇన్‌స్పెక్టర్‌ అన్భళగన్, ఎస్‌ఐలు ప్రాన్సిస్, రాజేంద్రన్‌ కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. చోరీకి గురైన లారీ మరుసటి రోజు తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సమీపాన స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు లారీని చోరీచేసి అక్కడ నిలిపి వెళ్లిన వ్యక్తి కోసం గాలించారు. ఇలావుండగా బుధవారం తిరుత్తురైపూండి కొత్త బస్టాండు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఒక యువకుడిని పోలీసులు పట్టుకుని విచారణ జరిపారు.

అతను కూత్తానల్లూరు సమీపంలోని పులియంకుడి నడి వీధికి చెందిన తంగరాజ్‌ కుమారుడు అశోక్‌ (25)గా తెలిసింది. ఇతను లారీని చోరీచేసి ఆసుపత్రి దగ్గర నిలిపినట్లు కనుగొన్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో కరోనా పరీక్ష చేయించుకునేందుకు అతను లారీని చోరీ చేసినట్లు తెలిసింది. చెన్నైలోని ప్రైవేటు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్‌ కర్ఫ్యూ కారణంగా సొంత ఊరుకు వచ్చేందుకు నిర్ణయించాడు. సరుకు లారీల ద్వారా తిరుత్తురై పూండికి వచ్చిన అతను అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కరోనా భీతి కారణంగా అతన్ని బంధువులు ఇంట్లోకి అనుమతించలేదు.

వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బంధువులు అతనిపై ఒత్తిడి తెచ్చారు. అతను అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుత్తురైపూండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయాలని కోరాడు. అక్కడున్న వైద్యులు ఉదయాన్నే పరీక్షలు జరుపుతామని చెప్పారు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటే తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో అక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అశోక్‌ లారీని చోరీచేసి ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో యువకుడిని నాగపట్టణం పోలీసులు అరెస్ట్‌ చేసి సబ్‌ జైలుకు తరలించారు.  

దారుణం: టీవీ పెట్టమని అడిగినందుకు..

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top