దుర్గగుడి చైర్మన్‌గా గౌరంగబాబు | yalamanchili gouranga babu as a sri durga malleswara swamy varla devasthanam chairman vijayawada | Sakshi
Sakshi News home page

దుర్గగుడి చైర్మన్‌గా గౌరంగబాబు

Sep 30 2016 8:25 AM | Updated on Sep 4 2017 3:39 PM

యలమంచిలి గౌరంగబాబు

యలమంచిలి గౌరంగబాబు

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన పాలకవర్గం ఖరారైంది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

చైర్మన్‌గా వై.గౌరంగబాబు!
మరో 13 మంది సభ్యులు
త్వరలోనే ఉత్తర్వులు జారీ
అధికారుల జోరుకు ఇక బ్రేకులు

విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన పాలకవర్గం ఖరారైంది. దేవస్థానం చైర్మన్‌గా టీడీపీ అర్బన్ సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబు నియమితులయ్యారు.
 
 
విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన పాలకవర్గం ఖరారైంది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. దసరా ఉత్సవాలు ప్రారభం కావడానికి కేవలం మరో 24 గంటలు ఉందనగా పాలక మండలిని ఎంపిక చేశారు. దేవస్థానం చైర్మన్‌గా అర్బన్ టీడీపీకి చెందిన సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబును నియమించారు.
 
 ఆయన ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్. వెలగపూడి శంకరబాబు, బడెటి ధర్మారావు, కోడెల సూర్యలతా కుమారి, ఈదీ సాంబశివరావు, పామర్తి విజయశేఖర్, డిఆర్‌ఎస్‌వివి ప్రసాద్, దుగ్గేంపాటి రాంబాబు, గుడిపాటి పద్మశేఖర్, విశ్వనాధపల్లి పాప, బి.పూర్ణమల్లి రామప్రసాద్, ఇట్టా పెంచిలయ్య, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, పెద్దిరెడ్డి రాజాలు ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అయితే బీజేపీ నేతలెవరికీ చోటు దక్కినట్లు లేదు.
 
 దశాబ్దం తరువాత
 దుర్గగుడికి దశాబ్ధం కాలం తరువాత పాలకమండలి ఏర్పాటు కాబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పి.నారాయణ రెడ్డి అధ్యక్షతన 2005-06లో పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కమిటీలు వేయలేదు. పాలకమండలికి మొత్తం 14 మందిని నియమిస్తుంటే అందులో 10 మంది కృష్ణాజిల్లాకు చెందిన వారు కాగా. బి.పూర్ణమల్లి రామప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లాకు, ఇట్టా పెంచలయ్య గుంటూరుకు  చెందిన వారు. ఇక తెలంగాణాలోని ఖమ్మంజిల్లాకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, నల్గొండ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రాజాలకు స్థానం కల్పించారని చెబుతున్నారు.
 
 ఏకపక్ష నిర్ణయాలకు చెక్కేనా?
 దేవస్థానం అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కుంకుమార్చన టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు రేట్లు విపరీతంగా పెంచేశారు. దీనిపై ప్రజల్లోను, మంత్రుల్లోను ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈనేపధ్యంలో పాలకమండలి వస్తే అధికారులు ఏకపక్ష నిర్ణయాలను కొంతవరకు కట్టడి చేసే అవకాశముంది.
 
 వెంకయ్యనాయుడు సిపార్సు బేఖాతర్?
 దుర్గగుడి చైర్మన్ పదవి కోసం నగరానికి చెందిన బీజేపీ రాష్ట్ర నేత వీరమాచినేని రంగప్రసాద్ పోటీపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కూడా రంగప్రసాద్ అత్యంత ఆప్తుడు కావడంతో వెంకయ్యనాయుడు చేత సిపార్సు చేయించుకున్నారని పార్టీ వర్గాల కథనం.
 
 బీజేపీ రాష్ట్ర పార్టీ కూడా రంగప్రసాద్ పేరునే దుర్గగుడికి సిపార్సు చేయడంతో ఆయనకే చైర్మన్‌పదవి వస్తుందని అందరూ భావించారు. వెంకయ్యనాయుడు సిపార్సును బేఖాతర్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబుకు చైర్మన్ పదవి ఇచ్చారు. ఇదిలా ఉండగా నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం పక్షం రోజుల కిందట ఇద్దరు నేతల పేర్లు దేవాదాయశాఖమంత్రి పీ మాణిక్యాలరావు సిఫార్సుతో పంపారు.
 
 ఈ ఇద్దరు పేర్లను కృష్ణాజిల్లాకు చెందిన ఒక మంత్రి, బీజేపీకి చెందిన మరొక ఎంపీకి నచ్చకపోవడంతో ఆ పేర్లను  పక్కన పెట్టినట్లు సమాచారం. బీజేపీ నేతల్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడటం, దేవాదాయశాఖ మంత్రి సిఫార్సు చేసిన పేర్లను పక్కన పెట్టడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement