
సాక్షి, చెన్నై: ఆధునిక సమాజంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరిలోనూ మానసిక బలహీనత పెరుగుతోంది. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడి, మనో వేదనకు లోనవుతున్నారు. ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఇలాంటి చిన్న విషయానికి మనోవేదనకు గురై ఓ మహిళ నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. చెన్నై అంబత్తూరు, రామ్‌నగర్ జవహర్ వీధికి చెందిన ప్రభు కంటైనర్ల వాహనాన్ని అద్దెకు ఇస్తుంటాడు. ప్రభుకు లత(26)తో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి కాపురం ఎంతో ఆనందకరంగా సాగుతోంది. బు«ధవారం లత తనకు కొబ్బరి బోండం కొనివ్వాలని ప్రభును కోరింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సమయంలో ప్రభు కొబ్బరి బొండం తీసుకు రాకపోవడంతో లత తీవ్ర ఆవేదనకు గురైంది.
ఈ విషయంగా భర్తను నిలదీయడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భర్తతో వాగ్వాదం అనంతరం లత తీవ్ర మనో వేదనలో పడింది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అంబత్తూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లత మృతదేహాన్ని శవ పంచనామాకు పంపించారు. లత మరణం వెనుక కొబ్బరి బొండం వివాదం ఉందని కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు పేర్కొన్నా, వివాహమైన ఆరేళ్లే అవుతుండడంతో వరకట్న వేధిపులు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులతో పాటు అంబత్తూరు ఆర్‌డీఓ విచారణ చేస్తున్నారు.