విహారం.. విషాదం

Two From Adilabad Missing In Boat Capsizes In Godavari River - Sakshi

పాపికొండలు విహారయాత్రలో పడవ మునక

జిల్లాకు చెందిన ఇద్దరు యువ విద్యుత్‌ ఇంజనీర్లు గల్లంతు

క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల పూజలు

సాక్షి, మంచిర్యాల (హాజీపూర్‌): విహారయాత్ర తీవ్ర విషాదం నింపింది. విద్యుత్‌శాఖలో జరిగిన సమావేశానికి వరంగల్‌కు వెళ్లిన జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు అటు నుంచి అటే స్నేహితులతో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలోని పాపికొండల యాత్రకు వెళ్లారు. అక్కడ పడవ మునిగిపోవడంతో వీరూ గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం నంనూర్‌ గ్రామానికి చెందిన విద్యుత్‌ ఉద్యోగి కారుకూరి సుదర్శన్‌–భూమక్క దంపతుల కుమార్తె రమ్య, కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు రామయ్య–శాంతమ్మ కుమారుడు లక్ష్మణ్‌ ఇటీవల విద్యుత్‌శాఖలో సబ్‌ æఇంజినీర్లుగా ఉద్యోగాలు సాధించారు. ఆదివారం వరంగల్‌లో ఇతర స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనలో విహార యాత్ర సాగిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోయింది.

చదువులో ఆదర్శం రమ్య
నంనూర్‌ గ్రామానికి చెందిన కారుకూరి రమ్య తండ్రి సుదర్శన్‌ పాతమంచిర్యాల సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చదువులో చిన్ననాటి నుంచి రాణిస్తూ తోటి స్నేహితులకు చదువులో సహకరిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండేది. తండ్రి విద్యుత్‌శాఖలో ఉద్యోగం చేస్తుండటంతో తానూ విద్యుత్‌ శాఖలోనే కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కొత్తగా విద్యుత్‌శాఖలో జరిగిన నియామకాల్లో ఉద్యోగం సాధించిన రమ్య కుమురంభీం జిల్లాలో సబ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ తనదైన ముద్రతో ముందుకెళ్తున్న రమ్య నెలరోజుల్లోనే తగిన గుర్తింపు సాధించింది. మొదటి నెల వేతనం కూడా అందుకుంది. దీంతో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాతగా వినాయక విగ్రహాన్ని అందజేసి వినాయక పూజల్లో పాల్గొనడమే కాకుండా నిమజ్జన ఉత్సవంలో పాల్గొని స్థానికులతో కలిసి  ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడింది. రమ్యకు ఒక సోదరుడు రఘు ఉన్నాడు. బీటెక్‌ పూర్తి చేసిన రఘు ఢిల్లీలో సివిల్స్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇరవై మూడేళ్ల తన సోదరి రమ్య గల్లంతు సమాచారంతో రఘు హుటాహుటినా బయలుదేరాడు.

కష్టపడి ఉద్యోగం సాధించి...
హాజీపూర్‌ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మణ్‌ తండ్రి రామయ్య సింగరేణి ఉద్యోగి కాగా పదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి శంకమ్మతోపాటు మొత్తంగా ముగ్గురు సంతానం కాగా పెద్ద సోదరుడు తిరుపతి సింగరేణిలో ఉద్యోగం చేస్తుండగా ఇద్దరు కవలలు ఉన్నారు. కవలలు అయిన రామ్‌–లక్ష్మణ్‌లలో రామ్‌ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇరవై ఆరేళ్ల లక్ష్మణ్‌ ఇటీవల విద్యుత్‌శాఖలో సబ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి నిర్మల్‌ జిల్లా భైంసాలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

లక్ష్మణ్‌ మృతదేహం ఆచూకీ లభ్యం
బొడ్డు లక్ష్మణ్‌(26) మృతదేహం ఆచూకీ లభించింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోదావరి తీరంలో గజ ఈతగాళ్ల గాలింపు చర్యలో భాగంగా ఈయన దేహం లభించినట్లు తెలుస్తోంది. క్షేమంగా వస్తాడు అనుకున్న గ్రామస్తులు, సభ్యులకు లక్ష్మణ్‌ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకోగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

గ్రామాల్లో విషాదచాయలు
నంనూర్‌ గ్రామానికి చెందిన రమ్య, కర్ణమామిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ పడవ ప్రమాదంలో గల్లంతు కావడంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాత్రి వరకు గల్లంతైన ఇరువురి ఆచూకీ లభించకపోవడంతో గ్రామాల్లో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. గల్లంతైన ఇరువురు ప్రాణాలతో బయటపడాలని గ్రామాల్లో పూజలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పడవ మునక సమాచారం తెలిసిన వెంటనే భద్రాచలం బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో బంధువులు, స్నేహితులు కంట్రోల్‌రూంకు పదేపదే ఫోన్‌ చేస్తూ వారి ఆచూకీ గురించి తెలుసుకుంటున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top