
‘అమ్మ’ పార్టీలో మరో ముసలం!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఇప్పటికే ముక్కచెక్కలైన పార్టీలో దినకరన్ రూపంలో మరో ముసలం పుట్టింది.
సీఎం ఎడపాడి నిర్ణయంపై దినకరన్ తిరుగుబాటు
తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు వారికి లేదని వ్యాఖ్య
ఆయన వ్యాఖ్యల్ని సమర్థించిన సీఎం వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఇప్పటికే ముక్కచెక్కలైన పార్టీలో దినకరన్ రూపంలో మరో ముసలం పుట్టింది. అన్నాడీఎంకేపై సర్వాధికారాలు తనవేనని, తనను బహిష్కరించే హక్కు ప్రధానకార్యదర్శికి తప్ప ఇంకెవరికీ లేదని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం వ్యాఖ్యానించారు. రెండాకుల చిహ్నంకోసం ఎన్నికల కమిషన్‌కు రూ.కోట్లు ఎరవేసిన కేసులో అరెస్టయిన దినకరన్ దాదాపు 34 రోజులపాటు జైల్లో ఉండడం తెలిసిందే.
బెయిల్‌పై విడుదలైన ఆయన శనివారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై పార్టీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పారు. తనకు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది ప్రధాన కార్యదర్శి శశికళ అని, ఆమెకు మాత్రమే తనను తొలగించే హక్కుందని స్పష్టం చేశారు. ఇకపై యథావిధిగా పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. శశికళ కుటుంబాన్ని శాశ్వతంగా దూరంపెడితే ఏకమయ్యేందుకు సిద్ధమని పన్నీర్‌సెల్వం తెలపగా, దీంతో సీఎం ఎడపాడి పళనిస్వామి తన ఇంట్లో 20 మంది మంత్రులతో సమావేశమై శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించినట్లు ప్రకటించారు.
అప్పట్లో దినకరన్ సైతం సీఎం ఎడపాడి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దీనికి భిన్నంగా శనివారం ఆయన ధిక్కారస్వరం వినిపించారు. సీఎం వర్గానికి చెందిన ముగ్గురు ఎంపీలు, పదిమంది ఎమ్మెల్యేలు దినకరన్‌వైపు మొగ్గుచూపడంతోపాటు ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో స్వాగతం కూడా పలికారు. పార్టీకి పునరంకితమవుతానని దినకరన్ చెప్పడంలో తప్పులేదని మంత్రి శ్రీనివాసన్ సమర్థించగా, దినకరన్‌కు పార్టీ బాధ్యతలపై సీఎం ఎడపాడి నిర్ణయం తీసుకుంటారని మరోమంత్రి సెంగోట్టవన్ చెప్పారు.