విద్యుత్ వినియోగ దారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
రూ. 887 కోట్ల అదనపు భారం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగ దారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2015–16 సంవత్సరంలో ఆమోదించిన దానికన్నా ఎక్కువైన ఖర్చు (ట్రూ–అప్)ను రాబట్టేందుకు డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. ఈ అదనపు భారం రూ.887 కోట్లు. 2017–18లో ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్‌సీని కోరాయి. కమిషన్ దీనికి అనుమతిస్తే ఏప్రిల్ నుంచి పెరిగే కొత్త విద్యుత్ చార్జీల్లో దీన్ని కలుపుతారు.
ఇప్పటికే రూ. 859 కోట్లను ప్రజల నుంచి రాబట్టేందుకు డిస్కమ్‌లు అనుమతి కోరాయి. విద్యుత్ నియంత్రణ మండలి సూచించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ప్రైవేటు విద్యుత్‌ను కొనడం వల్లే అదనంగా రూ. 887 కోట్ల భారం పడిందని డిస్కమ్‌లు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 2015–16 సంవత్సరంలో 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు.