ప్రభుత్వ పథకాలను అమలు చేయండి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను అమలు చేయండి

Published Fri, Nov 14 2014 2:11 AM

The government plans to implement

హొసూరు : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు జరిపి జిల్లా సమగ్రాభివృద్ధికి సహకరించాలని క్రిష్ణగిరి ఎంపీ కే.అశోక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ టి.పి.రాజేష్ అధ్యక్షతన జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం 2013-2014, 2014-2015 సంవత్సరాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఇంధిరాగాంధీ గృహ నిర్మాణ, జాతీయ జీవనాధార, ప్రధానమంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణ పథకాలు, నిర్మల్ భారత్ అభియాన్, వాటర్ షెడ్, సంయుక్త బీడుభూముల అభివృద్ధి తదితర పథకాల అమలుపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వర్షపు నీటి సేకరణ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేయాలన్నారు.

పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.11,100 ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఊతంగెరె ఎమ్మెల్యే మనోరంజితం నాగరాజు, జిల్లా రెవెన్యూ అధికారి బాలసుబ్రమణ్యం, పథక అధికారి మంత్రాచలం, హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, హొసూరు యూనియన్ చైర్ పర్సన్ పుష్పాసర్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement