భవిష్యత్ బయోటెక్నాలజీదే | The future of biotechnology | Sakshi
Sakshi News home page

భవిష్యత్ బయోటెక్నాలజీదే

Feb 9 2015 11:56 PM | Updated on Sep 2 2017 9:02 PM

భవిష్యత్  బయోటెక్నాలజీదే

భవిష్యత్ బయోటెక్నాలజీదే

బయోటెక్నాలజీలో భారత్ ప్రధాన శక్తిగా ఎదిగే దిశగా కర్ణాటక ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

సీఎం సిద్ధరామయ్య
రానున్న  మూడేళ్లలో  ‘ఎల్‌ఈడీ’ వెలుగులు
బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  

 
బెంగళూరు: బయోటెక్నాలజీలో భారత్ ప్రధాన శక్తిగా ఎదిగే దిశగా కర్ణాటక ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సోమవారం ఇక్కడి బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనను కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధు మాట్లాడుతూ రాష్ట్రంలో జైవిక పరమాణు ఇంజనీరింగ్ సంశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు అనుమతించాల్సిందిగా ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కోరినట్లు తెలిపారు. దేశంలోని బయోటెక్నాలజీ సంస్థలన్నింటిలోకి దాదాపు 52 శాతం సంస్థలు కర్ణాటకలోనే ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఉన్న 10 ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థలు రాష్ట్రంలో తన శాఖలను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో బయో టెక్నాలజీ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా బయోకాన్ సంస్థ చైర్మన్ కిరణ్ మజుందార్ షా నేతృత్వంలో ఓ ప్రత్యేక మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు
 
దేశంలో ఇకపై ఎల్‌ఈడీ వెలుగులు


రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని అన్ని వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీధి దీపాల్లోని సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విధానం  ద్వారా ఏడాదికి 10 వేల మెగావాట్‌ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా 1.5 బిలియన్ డాలర్లను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇప్పటికే న్యూఢిల్లీలో వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులను అమర్చామని, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 617 ఎల్‌ఈడీ బల్బులను అమర్చామని వెల్లడించారు. గతంలో ఒక్కో ఎల్‌ఈడీ బల్బు ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉండేదని ప్రస్తుతం రూ.150కి ఎల్‌ఈడీ బల్బులు అందుబాటులోకి వ చ్చేశాయని పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సబ్సిడీలను కనుక ప్రకటిస్తే ఒక్కో ఎల్‌ఈడీ బల్బు రూ.100కి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష జవదేకర్ మాట్లాడుతూ...ప్రస్తుతం బయో ఇంధన రంగంలో యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ కావాల్సినంత విద్యుత్ అందుబాటులో లేదని, అందువల్ల ప్రతి రోజూ డీజిల్‌తో నడిచే జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను అందించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాక స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సరికొత్త పధకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, బీటీశాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement