బయోటెక్నాలజీలో ఏపీ నయా రికార్డులు | AP sets new records in biotechnology | Sakshi
Sakshi News home page

బయోటెక్నాలజీలో ఏపీ నయా రికార్డులు

Apr 5 2025 5:41 AM | Updated on Apr 5 2025 5:41 AM

AP sets new records in biotechnology

వైఎస్‌ జగన్‌ పాలనలో వెలుగులీనిన రంగం

బయో ఇండస్ట్రియల్‌ విభాగంలో 12 శాతం వాటాతో మొదటి స్థానం

ఆక్వాఫీడ్, పౌల్ట్రీ ఫీడ్, ఆల్కహాల్‌లో రూ.71,724 కోట్ల విలువైన ఉత్పత్తులు

మొత్తంగా 6.7 శాతం వాటాతో ఐదో స్థానం 

2024లో రూ.95,030 కోట్ల విలువైన బయో ఉత్పత్తులు

పీఎల్‌ఐ స్కీం కింద లైఫజ్‌ పెన్సిలిన్‌ ఉత్పత్తితో పాటు 8 ఫార్మా క్లస్టర్లు

ఇండియా బయో ఎకానమీ నివేదిక–2025 వెల్లడి

సాక్షి, అమరావతి: బయో టెక్నాలజీ రంగంలో ఆంధ్ర­ప్రదేశ్‌ వేగంగా దూసుకుపోతోంది. 2024 సంవత్స­రంలో రూ.95,030 కోట్ల విలువైన బయోటెక్నాలజీ ఉత్పత్తులతో రాష్ట్రం దేశంలో ఐదో స్థానానికి చేరుకుంది. రూ.14,25,020 కోట్ల దేశీయ బయో ఎకానమీలో 6.7 శాతం వాటాతో రాష్ట్రం ఐదవ స్థానంలో నిలిచి­న­ట్లు ఇండియా బయో ఎకానమీ నివేదిక–2025 వెల్ల­డించింది. గడిచిన ఐదేళ్లుగా దేశీయ బయో టెక్నాలజీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. 

2020లో రూ.7,39,600 కోట్లుగా ఉన్న దేశీయ బయో టెక్నా­లజీ పరిశ్రమ ఇప్పుడు రెట్టింపై రూ.14.25 లక్షల కోట్లతో జీడీపీలో 4.25 శాతం వాటాకు చేరుకుంది. మొత్తం బయో టెక్నాలజీలో 47 శాతంతో బయో ఇండస్ట్రియల్‌ విభాగం మొదటి స్థానంలో నిలవగా, 35.2 శాతంతో బయో ఫార్మా రెండో స్థానంలో, 9.4 శా­తంతో బయో ఐటీ, 8.1 శాతంతో బయో అగ్రీ ఉన్నాయి. 2050 నాటికి దేశీయ బయో టెక్నాలజీ రంగం రూ.129 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

బయో ఇండస్ట్రీలో మొదటి స్థానం
2024లో దేశ వ్యాప్తంగా బయో ఇండస్ట్రీ విభాగం రూ.6,72,520 కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్‌ 12 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది రాష్ట్రంలో బయో ఇండస్ట్రీ ద్వారా రూ.71,724 కోట్ల విలువైన ఉత్పత్తులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఆక్వా ఫీడ్‌ రూ.38,528 కోట్లు, పౌల్ట్రీ ఫీడ్‌ రూ.12,986 కోట్లు, ఆల్కహాల్‌ రూ.20,210 కోట్లుగా ఉన్నాయి. 

ఏపీ తర్వాత మహారాష్ట్ర 11.4 శాతం వాటాతో రెండవ స్థానంలో, తమిళనాడు 10.1 శాతం, కర్ణాటక 8.5 శాతం, పంజాబ్‌ 8.4 శాతం వాటాతో ఉన్నాయి. బయో ఫార్మా రంగంలో కూడా రాష్ట్రం వేగంగా దూసుకుపోతోందని, ఏకంగా 8 ఫార్మా క్లస్టర్లతో దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 48 ఫార్మా క్లస్టర్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత గుజరాత్‌ 13 , ఆంధ్రప్రదేశ్‌ 8 క్లస్టర్లను కలిగి ఉందని తెలిపింది. 

పీఎల్‌ఐ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌) స్కీమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ కీలకమైన ఫార్మా ప్రాజెక్టులను దక్కించుకొని అప్పుడే ఉత్పత్తి ప్రారంభించిందని పేర్కొంది. అరబిందో గ్రూపునకు చెందిన లైఫజ్‌ అనే సంస్థ పెన్సిలిన్‌ జీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గతేడాది వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. మరోవైపు 274 స్టార్టప్‌లతో ఏపీ 10వ స్థానంలో నిలిచిందని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement