ఆ 13 మంది సాక్షుల్ని మళ్లీ విచారించండి | The 13 witnesses again vicarincandi | Sakshi
Sakshi News home page

ఆ 13 మంది సాక్షుల్ని మళ్లీ విచారించండి

Mar 5 2015 2:45 AM | Updated on Sep 18 2019 2:52 PM

ఉబర్ కేసుకి సంబంధించి 13 మంది సాక్షులను పునర్‌విచారణ చేయాలని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది.

ఉబర్ కేసులో హైకోర్టు
 
న్యూఢిల్లీ: ఉబర్ కేసుకి సంబంధించి 13 మంది సాక్షులను పునర్‌విచారణ చేయాలని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివ్‌కుమార్ యాదవ్ చేసుకున్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సునీతా గుప్తా ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా, పునర్‌విచారణ చేయాల్సిన వారి జాబితాలో నిందితుడు శివ్‌కుమార్‌తో సహా 13 మంది ఉన్నారని కోర్టు తెలిపింది. అలాగే ఈ కేసును పరిశీలించిన దర్యాప్తు అధికారులను, వైద్యులను కూడా మళ్లీ విచారించడానికి అనుమతినిచ్చింది.

తద్వారా పారదర్శక విచారణ చేసినట్టు అవుతుందని వివరించింది. సీఆర్‌పీసీ 309 ప్రకారం రోజువారీ పద్ధతిలో సాక్షుల్ని విచారించాలని చెప్పింది. దీంతో ఈ కేసులో సాక్షులుగా ఉన్న 2, 3, 4, 9, 12, 13, 14, 16, 20, 22, 24, 26, 27 నంబర్ల వారిని కోర్టు ఆదేశంతో తదుపరి విచారణ చేయనున్నారు. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా సాక్షులు కోర్టుకి అందుబాటులో లేకుంటే వారి వాంగ్మూలాన్ని ఉన్నదిఉన్నట్టుగా చదివి దానిని సాక్ష్యంగా పరిగణించాలని తెలిపింది. విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిండం వల్ల చేకూరేది ఏమీ ఉండదని నిందితునికి చెప్పింది. దాని వల్ల ఇంకా ఎక్కువ కాలం కస్టడీలో మగ్గాల్సి వస్తుందని పేర్కొంది.
   
సాక్షుల పునర్‌విచారణ కోసం నిందితుడు చేసుకున్న అప్పీలుని ట్రయిల్ కోర్టు ఫిబ్రవరి 18న తిరస్కరించింది. దీంతో నిందితుడు హైకోర్టుని ఆశ్రయించాడు. నిందితుడి అప్పీలుని విచారించి, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు తీర్పు వెలువరించొద్దని ట్రయిల్ కోర్టుని ఫిబ్రవరి 25న హైకోర్టు ఆదేశించింది. 28 మంది సాక్షుల్ని మళ్లీ విచారించాలని కోరుతూ తన న్యాయవాది మిశ్రా ద్వారా నిందితుడు హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ, వెంటనే మిశ్రా కొంత దిగివచ్చి 28 మంది సాక్షులు కాకుండా, నిందితునితో కలిపి 13 మందిని విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు.

డీఎన్‌ఏ రిపోర్టుతో సహా కొన్ని సాక్ష్యాలు పూర్తిగా నిరాధారమైనవని నిందితుడు కోర్టుకి విన్నవించాడు. వాటిని కావాలని సృష్టించారని తెలిపాడు. సాక్షుల నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించేంత వరకు జరుగుతున్న విచారణను ఆపాల్సిందిగా మిశ్రా కోరారు. నిందితుడి ఆరోపణలను ఢిల్లీ పోలీసు తరఫు న్యాయవాది రాజేశ్ మహాజన్ వ్యతిరేకించాడు. విచారణ వేగంగా జరుగుతోందని, ఒకవేళ నిందితుడి అప్పీలుని పరిగణలోకి తీసుకుని పునర్‌విచారణకి ఆదేశిస్తే విచారణ మందగిస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మహాజన్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 5న ఉబర్ సంస్థకి చెందిన క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. సంచలనం రేపిన ఈ సంఘటనలో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు అతనిపై జనవరి 13న రేప్, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులతో చార్జిషీట్ నమోదు చేశారు. విచారణను 15న ప్రారంభించి, 28 మంది సాక్ష్యుల నుంచి 17 రోజుల్లో వాంగ్మూలాన్ని ట్రయిల్ కోర్టు సేకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement