మా మంచి మాస్టారు | Teacher Became A School Bus Driver In Karnataka | Sakshi
Sakshi News home page

మా మంచి మాస్టారు

Jul 25 2018 10:39 AM | Updated on Sep 15 2018 4:05 PM

Teacher Became A School Bus Driver In Karnataka - Sakshi

పాఠశాల బస్సులో విద్యార్థులను తీసుకెళ్తూ

టీచర్‌ రాజారామ్‌.. రోజూ ఉదయాన్నే 8 గంటలకు మినీ బస్సును స్టార్ట్‌ చేస్తారు.     చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ విద్యార్థులను ఎక్కించుకుని 9:30 కల్లా పాఠశాలకు చేరుకుంటారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పాఠాలు చెప్పడంలో నిమగ్నం. మళ్లీ 5 గంటలకు మినీ బస్సు స్టార్ట్‌ చేయడం, విద్యార్థులను వారి వారి గ్రామాల్లో వదిలేయడం. ఇదీ ఆయన నిత్యకృత్యం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు     డ్రైవర్‌గా ఎందుకు మారాడు? అన్నదే ఆసక్తికరం.  

బొమ్మనహళ్లి:  కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తుండడంతో సర్కారీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది దిగజారుతూ వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలోని బ్రహ్మవర పట్టణం బరాలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజారామ్‌ (47).. డ్రాపౌట్స్‌తో పాటు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న తమ పాఠశాలను కాపాడడానికి నడుం బిగించారు. చుట్టుపక్కనున్న పలు పల్లెల విద్యార్థుల ప్రాథమికోన్నత చదువులకు బరాలి ప్రాథమికోన్నత పాఠశాల ఒక్కటే దిక్కు. దీంతో విద్యార్థులు ప్రతిరోజు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు చేరుకోవాల్సిందే. వాగులు, చెరువులు దాటుకుంటూ వెళ్లాల్సిన ఉన్నందున పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెంది స్కూలు మాన్పించసాగారు. క్రమంగా పాఠశాల విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చివరికి పాఠశాల మూతబడే పరిస్థితులు తలెత్తాయి. 

ఆదుకున్న రాజారామ్‌  
దీంతో మూతబడే ప్రమాదం నుంచి తమ పాఠశాలను కాపాడుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయుడు రాజారామ్‌ సంకల్పించారు. పాఠశాలకు వాహనం కొనుగోలు చేయడానికి బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థులకు పరిస్థితిని వివరించి సహాయం అర్థించారు. పూర్వ విద్యార్థులు తలోచెయ్యి వేసి పాఠశాలకు ఓ మినీబస్సును అందించారు. కానీ డ్రైవర్‌ను ఎక్కడి నుంచి తీసుకురావడం? పాఠశాల నిర్వహణకు వచ్చే నిధులు అంతంతమాత్రంగానే ఉండడంతో వాహనాన్ని తనే డ్రైవర్‌పాత్రనూ పోషించాలని టీచర్‌ రాజారామ్‌ సిద్ధమయ్యారు. ఎంతో సాధన తరువాత బడి బస్‌ను నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సంపాదించారు.

30 కిలోమీటర్లు, నాలుగు ట్రిప్పులు  
బరాలి గ్రామ చుట్టుపక్కనున్న శిరియార కల్లుబెట్టు, హొరళిజెడ్డు, అల్తారి కార్తిబెట్టు, కాజ్రళ్లి, మునిపురి తదితర గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి, తిరిగి ఇళ్లకు చేర్చడానికి రాజారామ్‌ ప్రతి రోజూ 30 కిలోమీటర్లు మేర నాలుగు ట్రిప్పులు తిప్పుతున్నారు.  
ఉదయం ఎనిమిది గంటలకు వాహనంతో గ్రామాలకు బయలుదేరి రెండు ట్రిప్పుల్లో విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తారు. సాయం త్రం ఐదు గంటలకు మరోసారి రెండు ట్రిప్పులు తిప్పి విద్యార్థులను ఇళ్లకు చేర్చుతారు.  
రాజారామ్‌ కృషికి ముగ్ధులైన గ్రామాల ప్రజలు తమ పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలకు పంపించసాగారు. దీంతో పదిలోపు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 90 కి చేరుకుంది.  
గణిత, సైన్స్‌ బోధిస్తున్న రాజారామ్‌తో అందుబాటులో లేనిరోజుల్లో వాహనానికి డ్రైవర్‌ను ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు సమాలోచనలు చేస్తున్నారు. పాఠశాలలో హెచ్‌ఎం, మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా రాజారామ్‌ మాత్రమే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.  

సేవకు ప్రశంసల జల్లు
పాఠశాల, విద్యార్థుల కోసం తపిస్తున్న రాజారామ్‌కు నలువైపులా నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళుతున్న రాజారామ్‌ ఫోటో నెట్, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన ప్రయత్నాన్ని మాజీ దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఫోటోను షేర్‌ చేసిన కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement