‘సుజిత్‌’ కోసం తమిళనాడు ప్రార్థనలు | Tamilnadu prays for Sujith Wilson, Rescue Operations On | Sakshi
Sakshi News home page

ఇంకా బోరు బావిలోనే చిన్నారి సుజిత్‌

Oct 27 2019 1:02 PM | Updated on Oct 27 2019 4:37 PM

Tamilnadu prays for Sujith Wilson, Rescue Operations On - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  తమిళనాడులో బోరు బావిలో పడ్డ  రెండేళ్ల సుజిత్‌ను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన  విషయం తెలిసిందే.  వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్‌ (40), కళామేరీ (35) దంపతులు, వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఆరోగ్యరాజ్‌కు సొంతిల్లు, సమీపంలోనే వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు కోసం ఐదేళ్ల క్రితం 500 అడుగుల లోతులో బోరుబావి తవి్వంచాడు. అయితే అందులో నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలానే వదిలేసి ప్లాస్టిక్‌మూత పెట్టాడు.

 ఇదిలా ఉండగా, ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.45 గంటల సమయంలో చిన్నకుమారుడు రెండేళ్ల సుజిత్‌ విల్సన్‌ ఇంటికి సమీపంలోని పెదనాన్న ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ప్లాస్టిక్‌ మూతపై కాలువేశాడు. ఈ మూత విరిగిపోగా బోరుబావిలోకి బాలుడు జారిపోయాడు. సుజిత్‌ ఏడుపులు విని తల్లి కళామేరీ, ఇరుగుపొరుగూ వచ్చి గుండెలుబాదుకుంటూ రోదించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నాలుగు ప్రొక్లయిన్లు రప్పించి, చిన్నపాటి అత్యాధునిక సీసీ కెమెరాలను బోరుబావిలోకి దించి బాలుడు 22 అడుగుల లోతులో ప్రాణాలతో వేలాడుతున్నట్లు గుర్తించారు. కెమెరాలను ఒక ల్యాప్‌టాప్‌తో అనుసంధానం చేసి దానిలోని దృశ్యాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రక్షింపు చర్యల్లో భాగంగా బోరుబావికి సమీపంలో సమాంతరంగా 15 అడుగుల లోతులోకి మట్టిని తవ్వుతున్నపుడు వచ్చిన ప్రకంపనలకు సుజిత్‌ మరింత లోతులోకి జారిపోయాడు. దీంతో రాత్రి 9 గంటలకు తవ్వకాల పనులను నిలిపివేశారు. బాలుని చేతికి తాడును చుట్టి పైకిలాగేందుకు ప్రయత్నాలు సాగించారు. 

మరోవైపు తల్లి కళామేరీ శనివారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో బోరుబావి వద్ద కూర్చుని బిడ్డను పలుకరించగా ‘అప్పా’ (నాన్నా) అనడం పైనున్నవారికి వినిపించింది. ఆ తరువాత బాలుడు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరికొద్దిసేపటి తరువాత బాలుడిపై మట్టిపడడం ప్రారంభమైంది. అరక్కోణం నుంచి 20 మందితో కూడిన ప్రకృతి వైపరీత్యాల రక్షణ చర్యల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం వరకు బాలుడు శ్వాసతీసుకోవడం గమనించారు.  అయితే శనివారం సాయంత్రానికి 70 అడుగుల లోతులోకి జారిపోగా శ్వాస వినిపించడం నిలిచిపోయింది. రాత్రి 7 గంటల సమయానికి బాలుడు వంద అడుగుల్లోకి వెళ్లిపోయాడు. బిడ్డ ఎప్పుడు బయటపడినా చికిత్స అందించేందుకు అంబులెన్స్‌తో వైద్య బృందం సిద్ధంగా ఉంది.  

స్పృహతప్పిన తల్లి: 
బోరుబావికి సమీపంలో కూర్చుని కన్నబిడ్డ గురించి కన్నీళ్ల పర్యంతమైంది. బిడ్డ ఏడుపు వినిపించినపుడు ‘ ఏడవకు నాన్నా ఏడవకు, ఇదిగో ఎత్తుకుంటాను’ అంటాను అంటూ ఊరడించడం అందరి హృదయాలను కలచివేసింది. బిడ్డ కోసం 24 గంటలకు పైగా కన్నీటి పర్యంతం అవుతున్న తల్లి కళామేరీ ఆ బాధను తట్టుకోలేక స్పృహ తప్పింది.  సమీపంలోని వైద్యులు వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి తరలించి గ్లూకోజ్‌ ఎక్కించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం సహాయక బృందానికి బాలుడు అందుబాటులోకి రాలేదు. 

సేవ్‌ సుజిత్‌ అంటూ ప్రార్థనలు.. 
బోరుబావిలో బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడం రాష్ట్ర ప్రజలను కలచివేసింది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒకవైపు దీపావళి పండుగలో నిమగ్నమై ఉంటూనే సేవ్‌ సుజిత్‌ అంటూ ప్రార్థనలు చేయసాగారు. టీవీలు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడి క్షేమ సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. సుజిల్‌ సురక్షితంగా బయటపడాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు, సామాజిక కార్యకర్తలు, మదురైలో పలువురు దివ్యాంగులు శనివారం సాయంత్రం ప్రార్థనలు చేశారు.
  
అలక్ష్యానికి అద్దం: నటుడు వివేక్‌ 
బోరుబావిలో బాలుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడడం అలక్ష్యం, అజాగ్రత్తలకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య సమాజ పోకడల కారణంగానే వినియోగంలో లేని బోరుబావులు దర్శనమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రమాదపరిస్థితులు సంభవించినపుడు వెంటనే రక్షణ చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక పరికరాలను కనుగొనాలని ఆయన సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement