శివాజీ పార్క్‌లో ఉన్న మరాఠీ యోధుడు శివాజీ మహారాజ్ విగ్రహ నిర్వహణ బాధ్యతను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్...
నగర కమిషనర్‌కు లేఖ రాసిన మేయర్ స్నేహల్
ఇంకా అందలేదన్న సీతారామ్ కుంటే
సాక్షి, ముంబై: శివాజీ పార్క్‌లో ఉన్న మరాఠీ యోధుడు శివాజీ మహారాజ్ విగ్రహ నిర్వహణ బాధ్యతను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) తీసుకోవాల్సిందిగా మేయర్ స్నేహల్ అంబేకర్ మున్సిపల్ కమిషనర్‌ను కోరింది. విగ్రాహ నిర్వహణ బాధ్యతను ఎవ్వరూ సక్రమంగా చేయలేదనే విషయాన్ని ఎమ్మెన్నెస్ కార్పొరేటర్ సంతోష్ దురే స్నేహల్ దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్నేహల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివాజీ విగ్రహ నిర్వహణ బాధ్యత తీసుకోవాల్సిందిగా కార్పొరేషన్‌ను కోరినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌కు కూడా లేఖ రాసినట్లు తెలిపారు.
బీఎంసీ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) నుంచి శివాజీ విగ్రహ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఎమ్మెన్నెస్ కార్పోరేటర్ సంతోష్ దురే.. బీఎంసీ ఆధీనంలో ఈ విగ్రహం నిర్వహణ జరగాలని, పీడబ్ల్యూడీ ఈ విగ్రహం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. సమన్వయ లోపం వల్ల బీఎంసీనే విగ్రహ నిర్వహణ చూస్తుందని పీడబ్ల్యూడీ భావించిందని చెప్పారు. అయితే మేయర్ సీతారామ్ కుంటే మాత్రం అంబేకర్ నుంచి ఎలాంటి లేఖను అందుకోలేదని చెబుతున్నారు. ‘లేఖ అందితేనే కదా అందులో ఏం రాసి ఉందో తెలిసేది’ అని అంటున్నారు.
విగ్రహ నిర్వహణను బీఎంసీ తన ఆధీనంలోకీ తెచ్చుకోవాలని లీడర్ ఆఫ్ ద హౌజ్ తృష్ణ విశ్వాస్ రావ్ అభిప్రాయపడ్డారు. గతేడాది పీడబ్ల్యూడీ.. శివాజీ విగ్రహ నిర్వహణను చూడాలని బీఎంసీకి లేఖ రాసింది. అయితే ఇంతకు మునుపే విగ్రహ నిర్వహణ కోసం అనుమతి కోరామని, కానీ పీడబ్ల్యూడీ నుంచి సమాధానం రాలేదని కార్పొరేషన్ ఆరోపిస్తోంది. విగ్రహ బాధ్యతను బీఎంసీ చేపట్టకుంటే తాము చేపడతామని ఎమ్మెన్నెస్ ఇటీవల ప్రక టించింది.