ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్’ను ప్రేరణగా తీసుకున్న భివండీలో కళాశాల విద్యార్థులు సోమవారం పలు ప్రాంతాల్లో ‘స్వచ్ఛ్ భివండీ’ నిర్వహించారు.
భివండీ , న్యూస్‌లైన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్’ను ప్రేరణగా తీసుకున్న భివండీలో కళాశాల విద్యార్థులు సోమవారం పలు ప్రాంతాల్లో ‘స్వచ్ఛ్ భివండీ’ నిర్వహించారు. కామత్‌ఘర్‌లోని పలు వీధులను శుభ్రపర్చారు. అదేవిధంగా కామత్‌ఘర్‌లోని గణేష్ నగర్, బ్రహ్మానంద్ నగర్‌లో వీధులు, ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. అంతేకాకుండా మురికి కాలువలను శుభ్రపర్చారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతపై స్థానికులకు కోరారు.
అయితే చెత్తను కేవలం చెత్త కుండీలలోనే వేయాలని సూచించారు. పరిశుభ్రతపై స్థానికుల్లో అవగాహన కల్పించారు. తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో దాదాపు 60 మంది కళాశాల విద్యార్థినులు, 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బల్లూరి చంద్రశేఖర్, మచ్చ మాధురి, జోరీగల బాలకృష్ణ, ధార శ్రీనివాస్, గౌరి సదానంద్, వడ్లకొండ నితిన్, కోట అన్వేష్, బండారి రవిరాజ్, రాపెల్లి సూర్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు.