మూఢాచారాలకు ముకుతాడు

Superstition beliefs stopped bill passed in raj bhavan - Sakshi

నియంత్రణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం 

మంత్రాలతో ప్రజలను మోసగిస్తే జైలుశిక్ష, జరిమానాలు

ఛూ మంతర్‌కాళీ, నీ కష్టాల గుట్టు తెలిసింది, చిటికెలో వాటిని కడతేరుస్తాను అని మాయమాటలతో అమాయక జనాలను రకరకాలుగా దోచుకునే మోసగాళ్లకు కొదవ లేదు. మూఢ నమ్మకాలకూ అంతులేదు. వాటికి ఏదో ఒక చోట పుల్‌స్టాప్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్‌భవన్‌ ఆమోదించింది. 

సాక్షి, బెంగళూరు: డిజిటల్‌ యుగంలో కూడా మూఢనమ్మకాలు పాతుకుపోయాయి. నిరక్షరాస్యత, వెనుకబాటు వల్ల మూఢనమ్మకాలతో నకిలీ స్వాములు, బాబాలు మాయలు మంత్రాలు, క్షుద్రపూజలంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల నియంత్రణ బిల్లును గత ఏడాది బెళగావి సువర్ణసౌధలో జరిగిన శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు తాజాగా రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఆమోదముద్ర వేయడంతో ఇక చట్టం సాకారమైంది. ఆ చట్టం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా వ్యక్తి మృతి చెందినా లేదా గాయపడినా భారతీయ శిక్షా స్మతి ప్రకారం హత్య (302), హత్యాయత్నం(307) కేసుల్ని బాధ్యులపై నమోదు చేస్తారు. మాయలు, మంత్రాలు, చేతబడి, బాణామతి, మడె స్నానం తదితరాలను మూఢనమ్మకాల నియంత్రణ చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ఒక సంవత్సరం నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించవచ్చు. 

భిన్న వాదనలపై స్పష్టత 
మూఢ నమ్మకాల నియంత్రణ చట్టానికి సంబంధించి మొదటి నుంచి సానుకూల, వ్యతిరేకతలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ చట్టం అస్పష్టంగా ఉందని దీనివల్ల దేవాలయాలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిర్వహించే పూజలు, హోమాలు సైతం మూఢనమ్మకాలుగా పరిగణించే అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఏవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయో, ఏవి రావో నిర్ధారించడానికి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పరచింది. పూర్తి  వివరాలతో కూడిన జాబితాను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం, పోలీసుల సహాయంతో అనుమానిత స్థలాలపై ఆ అధికారి తనిఖీలు చేపట్టడానికి  పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

చట్టం పరిధిలోకి వచ్చేవి...
1. బాణామతి, నగ్నంగా ఊరేగించడం, వ్యక్తి లేదా  సమూహంపై నిషేధం, బహిష్కారం
2. అతీంద్రియ శక్తులు ఆవహిస్తాయంటూ ప్రచారం
3. దయ్యాలు, భూతాలు విడిపిస్తామంటూ హింసించడం, కొక్కెలకు వేలాడదీయడం, బహిరంగంగా లైంగిక చర్యకు ప్రేరేపించడం లేదా ఒత్తిడి చేయడం, నోటిలో మల, మూత్రాలు వేయడం
4. వ్యక్తులను సాతాను, దయ్యం, భూతమంటూ సంబోధించడం 
5. దయ్యాలను ఆహ్వానించడం, అఘోర, చేతబడి చర్యలకు ప్రోత్సహించడం
6. వేళ్లతో తాకుతూ శస్త్రచికిత్సలు చేయడం
7. తమను తాము అవాతరపురుషుడిగా ప్రకటించుకోవడం, గత జన్మలో మనమిద్దరం భార్యభర్తలమనీ లేదా ప్రేమికులమంటూ మహిళలు, యువతులను ప్రలోభ పెట్టి లైంగిక చర్యలకు ప్రేరేపించడం
8. పిల్లలను ముళ్లు, నిప్పులపై నడిపించడం
9. రుతుక్రమంలోనున్న స్త్రీలను, గర్భిణీలను ప్రత్యేకంగా ఉంచడం
10. మడిస్నానం, నోటికి శూలాలు, తాళాలు వేయడం తదితరాలు. 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top