హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తన ప్రత్యర్థి పార్టీ నాయకులైన ఎల్‌కే అద్వానీ, జస్వంత్‌సింగ్‌లపై ప్రశంసలు కురిపించారు.
షోలాపూర్ : హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తన ప్రత్యర్థి పార్టీ నాయకులైన ఎల్‌కే అద్వానీ, జస్వంత్‌సింగ్‌లపై ప్రశంసలు కురిపించారు. సీనియర్లను కించపరచకూడదన్నారు. వారు సీనియర్లని, అందువల్ల వారిని గౌరవించాలని హితవు పలికారు. పార్టీలో వారిని అవమానపరచకూడదని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జస్వంత్ సింగ్ చాలా అద్భుతంగా పని చేశారని కొనియాడారు. దేశం మొత్తం ఆయనను గౌరవిస్తుందని చెప్పారు. బీజేపీ అధినాయకత్వం తనకు టికెట్ కేటాయించకపోవడంతో రాజస్థాన్‌లోని బార్మర్ లోక్‌సభ స్థానం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.
యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో దేశం సురక్షితంగా మారిందని చెప్పుకున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం సమస్యగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నక్సల్స్‌ను అదుపు చేశామని అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రెండు దట్టమైన అడవులున్నాయని, అక్కడే రెండు విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఓ ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడుతూ, నక్సల్స్‌ను అదుపు చేసేందుకు రెండంచల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురూ, ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌లను ఉరి తీసే విషయంలో తాను ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని చెప్పారు. మరోసారి తాను హోం మంత్రిని అవుతానో లేదో తెలియదన్నారు.