పార్లమెంట్ ఎదుట శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన యాసిడ్ దాడుల బాధితులు, వారి మద్దతుదారులపై గురువారం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎదుట శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన యాసిడ్ దాడుల బాధితులు, వారి మద్దతుదారులపై గురువారం పోలీసులు విరుచుకుపడ్డారు. వారిని బలవంతంగా అక్కడ నుంచి ఈడ్చుకుపోయి జీపుల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు యాసిడ్ బాధితులతోపాటు పలువురికి గాయాలయ్యాయి. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ షా వేసిన పిల్‌పై స్పందించిన సుప్రీంకోర్టు దేశంలో యాసిడ్ అమ్మకాలను నిషేధించాలని ఆదేశించింది. కాగా, ఈ ఆదేశాలను అమలుచేయాలంటూ గత వారం రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద యాసిడ్ దాడి బాధితులు, వారి మద్దతుదారులు నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల నష్టపరిహారం ఇంతవరకు అందలేదని వారు ఆరోపించారు.
అలాగే తమ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. అయితే వారం రోజులుగా తమ ఆందోళనను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళనకారులు గురువారం పార్లమెంట్ ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. కాగా, పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని యాసిడ్ బాధితురాలు రూప, లక్ష్మి తదితరులు తెలిపారు. తమను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి హింసించారని ఆరోపించారు. కొందరు మగవారిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని రూప, లక్ష్మి తెలిపారు. కాగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పార్లమెంట్ భవనం ముందు వారు ఆందోళనకు దిగడంతో అడ్డుకున్నామని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ అధికారులు తెలిపారు.