మెట్రో చార్జీల కమిటీని ఏర్పాటు చేయరేం? | set up committee on metro charges? | Sakshi
Sakshi News home page

మెట్రో చార్జీల కమిటీని ఏర్పాటు చేయరేం?

Dec 21 2014 10:16 PM | Updated on Oct 16 2018 5:16 PM

వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మధ్య నడుస్తున్న మెట్రో చార్జీలు నిశ్చయించేందుకు..

సాక్షి, ముంబై: వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మధ్య నడుస్తున్న మెట్రో చార్జీలు నిశ్చయించేందుకు కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో కేంద్రంపై బాంబే ైెహ కోర్టు మండిపడింది. కోర్టు చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రానికి ఇప్పటికే రెండు సార్లు గడువు ఇచ్చింది. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమేగాకుండా 2015 జనవరి ఆఖరు వరకు మరోసారి గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కేంద్రం వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఇంతవరకు కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో రిలయన్స్ సూచించిన చార్జీల పెంపు ప్రతిపాదనకు మంజూరు ఇవ్వాలా..? వద్దా..? అనే దానిపై ఆయోమయ పరిస్ధితి నెలకొంది. తీర్పు ఇచ్చేందుకు కోర్టు జనవరి ఏడో తేదీ నిర్ణయించింది.

చార్జీలను జనవరి ఎనిమిదో తేదీ వరకు ఇప్పుడెలా ఉన్నాయో అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా చార్జీలు నిర్ణయించేందుకు హై కోర్టుకు చెందిన ఏక సభ్య కమిటీ రిలయన్స్‌కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెమ్మార్డీయే పరిపాలన విభాగం అపీల్ చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, న్యాయమూర్తి బి.పి.కులాబావాలా ల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా మెట్రో చార్జీలు నిశ్చయించేందుకు కమిటీ ఏర్పాటు చేసేందుకు జనవరి 31 వరకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాని కమిటీ ఏర్పాటుచేయాలని గత జూలై నుంచి తరుచూ హెచ్చరిస్తున్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని రిలయన్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కోర్టు నవంబర్ 30లోపు కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి తుది గడువు ఇచ్చింది.

అప్పటిలోగా కేంద్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రిలయన్స్ సూచించిన చార్జీల పెంపు ప్రతిపాదనను పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయినా కేంద్రం స్పందనలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికే మెట్రో చార్జీలు స్వల్పంగా ఉండడంవల్ల రిలయన్స్‌కు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు చార్జీలు నిర్ణయించే కమిటీ ఏర్పాటు చేయడంలో మరింత జాప్యం జరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు కేంద్రాన్ని, ఇటు ఎమ్మెమ్మార్డీయేని గట్టిగా మందలించింది. మెట్రో చార్జీల పెంపు విషయమై కేంద్రం కమిటీని ఏర్పాటుచేయని పక్షంలో జనవరి ఏడో తేదీన రిలయన్స్ సమర్పించిన చార్జీల పెంపు ప్రతిపాదనపై విచారణ జరిపి ఎనిమిదో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలుచేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement