కారుతో తీసుకెళుతున్న టాస్మాక్ నగదు రూ.40 లక్షలను అపహరించేందుకు ఒక ముఠా విఫలయత్నం చేసింది. ఆ సమయంలో కారులో ఉన్న సెక్యూరిటీ గార్డు
టీనగర్: కారుతో తీసుకెళుతున్న టాస్మాక్ నగదు రూ.40 లక్షలను అపహరించేందుకు ఒక ముఠా విఫలయత్నం చేసింది. ఆ సమయంలో కారులో ఉన్న సెక్యూరిటీ గార్డు దాడికి గురై మృతిచెందాడు. కొలత్తూరులో సోమవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ దుకాణాలలో వసూలయ్యే నగదును ఓ ప్రైవేటు సంస్థ వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. కొలత్తూరు సమీపంలోగల సెంథిల్‌నగర్ 200 అడుగుల రోడ్డులోగల టాస్మాక్ మద్యం దుకాణంలో నగదు వసూలు చేసేందుకు సోమవారం సాయంత్రం ప్రైవేటు సంస్థ ఉద్యోగులు కారులో వెళ్లారు. ఆ సంస్థ అధికారి అయిన కుండ్రత్తూరు అనకాపుత్తూరుకు చెందిన మోహన్, ఆవడి మిట్నమల్లికి చెందిన సెక్యూరిటీ రాజేంద్రన్ (55) కారులో ఉన్నారు.
డ్రైవర్ వినోద్‌కుమార్ కారు నడిపారు. మద్యం దుకాణం సమీపంలో కారు నిలిపి మోహన్ మాత్రం నగదు వసూలు చేసేందుకు వెళ్లారు. సెక్యూరిటీ రాజేంద్రన్, డ్రైవర్ వినోద్‌కుమార్ కారులోనే కూర్చున్నారు. ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని యువకులు కత్తులు చేతబట్టి కారు వద్దకు వచ్చారు. హఠాత్తుగా కారులోవున్న రాజేంద్రన్, వినోద్‌కుమార్‌పై కారపుపొడి చల్లారు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో ఇరువురూ హతాశులయ్యారు. ఈ లోపు దుండగులు సెక్యూరిటీ రాజేంద్రన్‌ను కారు నుంచి వెలుపలికి లాగి కత్తులతో దాడి చేశారు. దీంతో అతను రక్తపు మడుగులో కిందపడిపోయాడు. దీన్ని గమనించి దిగ్భ్రాంతి చెందిన డ్రైవర్ వినోద్‌కుమార్ కారు నుంచి కిందికి దిగి పరుగు లంకించుకున్నాడు. ఆ సమయంలో కారు తలుపులను రిమోట్ ద్వారా లాక్ చేశాడు. వెంటనే దుండగులు కారు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు.
అది విఫలం కావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో కారులో ఉన్న టాస్మాక్ నగదు రూ.40 లక్షలు దోపిడీకి గురికాలేదు. స్థానికులు తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ రాజేంద్రన్‌ను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. హంతకుల గురించిన వివరాలు ఇంతవరకు తెలియలేదు. కారులో వచ్చిన వినోద్‌కుమార్, మోహన్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొన్ని నెలల క్రితం నీలాంగరై సమీపానగల అక్కరైలో ఇదే విధంగా టాస్మాక్ వసూలు నగదు కోటి రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ కేసులో నిందితులు ఇంతవరకు పట్టుబడలేదు. అదే వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం సమీపంలోగల సీసీ కెమెరాల ఆధారాంగా నిందితుల కోసం పరిశీలన జరుపుతున్నారు.