భూముల ధరలకు రెక్కలు | Sakshi
Sakshi News home page

భూముల ధరలకు రెక్కలు

Published Fri, Oct 21 2016 2:50 PM

భూముల ధరలకు రెక్కలు - Sakshi

వెంచర్లకు సొబగులద్దుతున్న రియల్టర్లు 
జిల్లా కేంద్రం మెదక్‌లో భారీగా పెరుగుదల
తూప్రాన్, నర్సాపూర్‌లోనూ అదేదారి
సామాన్యులకు అందనంత ఎత్తులో ప్లాట్ల ధరలు
 
కొత్త జిల్లా ఏర్పాటుతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లా కేంద్రం మెదక్‌తోపాటు డివిజన్ కేంద్రాలుగా ఏర్పడిన తూప్రాన్, నర్సాపూర్‌లలో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. భూముల క్రయవిక్రయాలు సైతం ఊపందుకుంటున్నాయి. ప్లాట్లతోపాటు వ్యవసాయభూముల ధరలూ పెరిగాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల్లో 'కొత్త’ ఉత్సాహం కనిపిస్తోంది.
 
సాక్షి, మెదక్‌ : మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, చేగుంటలలో రియల్‌ భూమ్‌ జోరందుకుంది. ఆయా ప్రాంతాల్లో  వెంచర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు భూముల ధరలు అమాంతంగా పెరగటంతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునేందుకు ప్లాటు కొనాలుకునే ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రియల్‌భూమ్‌తో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెండుమూడు మాసాలుగా మెదక్, తూప్రాన్ లలో భూముల రిజిసే్ట్రషన్లు మోస్తరుగానే సాగుతున్నాయి. అయితే నర్సాపూర్‌లో మాత్రం భూముల రిజిసే్ట్రషన్లు కొంత ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువగానే సమకూరుతోంది. 
 
జిల్లా కేంద్రంలోనూ..
జిల్లా ఏర్పాటుతో హైదరాబాద్‌తో సమానంగా భూమి ధరలు పెరిగాయి. మెదక్‌.. జిల్లా కేంద్రంగా అవతరించటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మెదక్‌ పట్టణంలో గజానికి రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు ధర పలుకుతుంది. మెదక్‌ పట్టణం మంబోజిపల్లి, పిల్లికొటాల, అవులసపల్లి, హవేలిఘనపూర్‌వైపు ప్రైవేటు భూములు అందుబాటులో ఉండటంతో అక్కడ వెంచర్లు వేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో అటువైపు వ్యవసాయభూముల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఎకరాకు కోటికిపైగానే ధర పలుకుతోంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. మెదక్‌ పట్టణం అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉండటంతో  వెంచర్లు చేసేందుకు ఎక్కువ మంది రియల్‌ వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని చిన్నశంకరంపేట, రామాయంపేట, పాపన్నపేట మండలంలో సైతం భూముల ధరలు పెరుగుతున్నాయి. 
 
తూప్రాన్ లోనూ..
తూప్రాన్ మండలం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాడిన నేపథ్యంలో ఒక్కసారిగా మండలంలోని భూములకు రెక్కలు వచ్చాయి. తూప్రాన్, చేగుంట, నార్సింగి 44 హైవే ఉండటంతో భూముల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. గతంలో ఉన్న ధరకంటే రియల్‌ వ్యాపారులు ధరలను ఆమాంతం మూడింతలు పెంచేశారు. ప్రజలు సైతం భూముల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో రోజుకు మూడు నుంచి ఐదు మాత్రమే భూములు రిజిసే్ట్రషన్లు అయ్యేవి. కాని దసరా పండుగకు రెవెన్యూ డివిజన్ గా మారనుందని తెలిసిన ఉహగానాలతో నెల రోజుల ముందు నుంచి భూములకు రెక్కలు వచ్చాయి. నిత్యం సబ్‌ రిజిష్టరు కార్యాలయంలో 1015 వరకు డాక్యు మెంటేషన్ అవుతున్నాయి. అంటే రెవెన్యూ డివిజన్ ఏర్పడడంతో మండలంలో ఏమేరకు రెవెన్యూ పెరిగిందో స్పష్టమవుతోంది. గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు రిజిసే్ట్రషన్లతో రూ.5,67,17,160 కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్లు సమాచారం.రెవెన్యూ డివిజన్ కావటంతో తూప్రాన్ సబ్‌డివిజన్ పరిధిలోని తూప్రాన్, చేగుంట రియల్‌జోరు కొనసాగుతోంది.  జాతీయ రహదారి పక్కగా పట్టణాలు ఉండటం కూడా రియల్‌ భూమ్‌కు కలిసివస్తుంది.  
 
నర్సాపూర్‌లో సైతం...
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో నర్సాపూర్‌ ప్రాంతంలో సైతం భూముల ధరలు పెరిగాయి. నర్సాపూర్‌ డివిజన్ కేంద్రం కావటంతో ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది స్థిరపడేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న భూములు ధరలు అమాంతంగా పెరిగాయి. నర్సాపూర్‌లో రిజిసే్ట్రషన్ల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. రిజిసే్ట్రషన్ల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువగానే ఆదాయం సమకూరుతోంది. రాబోయే రోజుల్లో నర్సాపూర్‌ ప్రాంతంలో వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.    
 

Advertisement
Advertisement