కచ్చదీవుల్లోకి జాలర్లు

కచ్చదీవుల్లోకి జాలర్లు - Sakshi


సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికార మార్పుతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు మిగిలింది నిరాశే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర జాలర్లపై మరింతగా శ్రీలంక సేనలు విరుచుకుపడుతూ వస్తున్నారు. సుమారు మూడు వందల మందిని బందీలుగా పట్టుకెళ్లారు. పదుల సంఖ్యలో పడవల్ని స్వాధీనం చేసి తీసుకెళ్లారు. అయితే పడవల్ని తమ వద్దే ఉంచేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడితో కొందర్ని విడుదల చేశారు. సుమారు 94 మంది ఆ దేశంలోని పలు చెరల్లో బందీలుగా ఉన్నారు. తమ మీద వరుసదాడులు జరుగుతుండడంతో విసిగి వేసారిన రామేశ్వరం తీర జాలర్లు సమరానికి రెడీ అయ్యారు.

 

 కచ్చదీవుల్లోకి

 తమకు భద్రత కల్పించాలన్న నినాదంతో సమ్మె బాటపట్టారు. కడలిలో తమకు భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వడం, లంక సేనల ఆగడాలకు పూర్తిగా కళ్లెం వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి, పారంపర్యంగా కచ్చదీవుల్లో తమకు కలిగిన చేపలవేట హక్కును పరిరక్షించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపల వేటాకు అవకాశం, శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లందర్నీ విడుదల చేయాలని, పడవల్ని తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో పది రోజులుగా రామేశ్వరం కేంద్రంగా జాలర్లు ఆందోళనలు చేస్తూవస్తున్నారు. చేపల వేటకు దూరంగా సమ్మె బాటలో జాలర్ల పయనించినా, కేంద్రం మాత్రం చోద్యం చూసింది. దీంతో జాలర్లలో ఆగ్రహావేశాలు రగిలాయి. శనివారం వందలాది మంది జాలర్లు తమ కుటుంబాలతో కలసి కచ్చదీవుల బాటపట్టారు. రామేశ్వరం వేర్కొడు హార్బర్ వద్దకు చేరుకున్నాయి.

 

 ఉత్కంఠ

 జాలర్ల సంఘాల నేతల ప్రేమనాథన్, సహాయరాజ్, జేసురాజ్, దేవదాసు, ఆంటోని, మేరి, తమిళనాడు పుదుచ్చేరి జాలర్ల సంఘాల ప్రతినిధి బోసు నేతృత్వంలో జాలర్లు ర్యాలీగా చలో కచ్చదీవు నినాదంతో బయలు దేరారు. పోలీసులు అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించి కడలిలోకి వచ్చిన పక్షంలో వారిని అడ్డుకునేందుకు నావికాదళం, భారత కోస్టుగార్డు సిద్ధమైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ ర్యాలీ రామేశ్వరం తీరంలోని వేర్కొడు హార్బర్‌ను సమీపించింది.

 

 మంత్రి హామీతో వెనక్కి

 జాలర్లు కచ్చదీవుల్లోకి పయనం అవుతారా..?, వీరిని ఏ రూపంలో భద్రతా బలగాలు అడ్డుకోనున్నాయో...? అన్న ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. జాలర్ల సంఘాల ప్రతినిధులతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయొద్దని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంద్దామని హితవు పలికారు. పది రోజుల్లో శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల్ని స్వాధీనం చేసుకుని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. జాలర్ల సంఘాల బృందం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలుసుకునేందుకు చర్యలు తీసుకుంటామని సూచించారు. దీంతో జాలర్లు వెనక్కు తగ్గారు. కచ్చదీవుల బాటను వాయిదా వేసుకున్నారు. అయితే, పది రోజుల పాటుగా గడువును కేంద్రానికి వచ్చారు. అంతలోపు పడవులు అప్పగించాలని, సుష్మాస్వరాజ్‌తో సంప్రదింపులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top