పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సెనైడ్‌ను ప్రయోగించి వరుస హత్యలు చేసిన కిరాతకుడికి మంగళూరు న్యాయస్థానం శనివారం ఉరి శిక్ష విధించింది.
బెంగళూరు, న్యూస్‌లైన్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సెనైడ్‌ను ప్రయోగించి వరుస హత్యలు చేసిన కిరాతకుడికి మంగళూరు న్యాయస్థానం శనివారం ఉరి శిక్ష విధించింది. మోహన్ కుమార్ అలియాస్ సెనైడ్ మోహన్ అలియాస్ ఆనంద్ (46) అనే ఈ నిందితుడు.. మహిళల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా నిర్దయగా వారిని అంతమొందించాడు. జడ్జి తీర్పును వెలువరించడానికి ముందు మోహన్ ఆయనకు ఓ ఉత్తరం అందించడానికి ప్రయత్నించాడు. దానిని తీసుకుని చదవాలని పబ్లిక్ ప్య్రాసిక్యూటర్ చిబ్బయ్యకు జడ్జి బీకే. నాయర్ సూచించారు. తనకు వృద్ధాప్యంలోని తల్లితో పాటు భార్య, పిల్లలు ఉన్నారని, వారి యోగ క్షేమాలు చూసుకోవడానికి అవకాశం కల్పించాలని ఉత్తరంలో కోరాడు.
తమ కుటుంబానికి ఇతరత్రా ఆదాయం లేనందున, శిక్షను ఖరారు చేసే ముందు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. మహిళలను అతి దారుణంగా హత్య చేశాడని, వారు మృత్యువుతో పోరాడుతున్న సమయంలో నగలు తీసుకుని పారిపోయాడని చిబ్బయ్య చెబుతూ, ఇతని పట్ల ఎలాంటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని సూచించారు. రౌడీలు హత్య చేస్తే... అది వారి వృత్తి అని భావించవచ్చు. అయితే ఇతను వారికంటే కిరాతకుడు అన్నారు. న్యాయస్థానం క్షమిస్తే ఇలాంటి మోహన్‌లు సమాజంలో మరింత మంది పుట్టుకొస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన జడ్జి బీకే. నాయక్ ఉరి శిక్షను ఖరారు చేశారు. మోహన్ తరఫున వాదించడానికి దక్షిణ కన్నడ జిల్లాలో ఒక్క న్యాయవాది ముందుకు రాలేదు. దీంతో అతనే వాదించుకున్నాడు.
మూడు కేసుల్లో ఉరి
బంట్వాళ సమీపంలోని బరిమారు ప్రాంతానికి చెందిన అనిత, వామదపదకు చెందిన లీలావతి, సుళ్యకు చెందిన సునంద అనే ముగ్గురిని హత్య చేసిన కేసుల్లో ఇతనికి శిక్ష పడింది. ఇంకా 17 మంది మహిళలను హత్య చేశాడనే అభియోగాలు ఉన్నాయి. కాగా ఈ తీర్పును సవాలు చేస్తూ తాను హైకోర్టుకు వెళతానని మోహన్ కుమార్ మీడియాతో చెప్పాడు.
శాడిస్టుగా మారిన పీఈటీ మాస్టర్
దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ సమీపంలోని ఒక స్కూలులో మోహన్ కుమార్ పీఈటీ మాస్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. పలు ప్రాంతాలలో సంచరిస్తూ పెళ్లి కాని యువతులతో పరిచయం పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని మూడు రోజుల పాటు వారితో శారీరక సంబంధాలు కొనసాగించే వాడు. నాలుగో రోజు ఇప్పుడే గర్భం వద్దని, కొన్ని రోజులు సంతోషంగా గడుపుదామని నమ్మబలికే వాడు. అదును చూసి గర్భం రాకుండా ఉండటానికి ఈ గుళికలు వేసుకోవాలంటూ సెనైడ్ ఇచ్చేవాడు. క్షణాల్లో యువతులు కింద పడి కొట్టు మిట్టాడుతున్న సమయంలో కనికరం లేకుండా వారి శరీరంపై ఉన్న బంగారు నగలు లాక్కుని పారిపోయేవాడు. 2009లో అనితను ఇలాగే మట్టుబెట్టాడు.
ప్రేమ వివాహం విషయంలో హత్య జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే స్థానిక సంఘ్ పరివార్ నాయకులు లవ్ జిహాద్ పేరిట పెళ్లి చేసుకుని మత మార్పిడికి ప్రయత్నించారని, ఆమె అంగీకరించక పోవడంతో హత్య చేశారని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. మోహన్ ఫొటోలు సేకరించి రద్దీ ఉన్న ప్రాంతాల్లో అతికించారు. అనితను పరిచయం చేసుకున్న సమయంలో అతను ఉపయోగించిన మొబైల్ నంబరు సేకరించారు. ఈలోగానే సెనై డ్ ప్రయోగంతో అతను మొత్తం 20 మందిని మట్టుబెట్టాడని దర్యాప్తులో తేలింది. మూడవ భార్య శ్రీదేవి ఇంటిలో తల దాచుకుని ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి 12 మారు పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.