లక్షా 30 వేల లైసెన్సుల రద్దు 

Over 1.3 Lakh Driving Licences Cancelled In Tamil Nadu - Sakshi

ఒక్క చెన్నైలోనే రెండింతలు పెరిగిన

మందుబాబులు జరిమానా రూపంలో రూ. 29 కోట్ల వసూళ్లు

సాక్షి, చెన్నై: నగరంలో ఈ ఏడాది ట్రాఫిక్‌ నిబంధనల్ని పదేపదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులైన వాహనచోదకుల లక్షా 30 వేల మంది డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఒక్క ఏడాదిలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రెట్టింపు అయింది. చెన్నైలో ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి వారి భరతం పట్టే రీతిలో ట్రాఫిక్‌ పోలీసులు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. హెల్మెట్, సీట్‌ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారు కొందరు అయితే, ట్రిపుల్‌ రైటింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు మరెందరో. సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారు మరీ ఎక్కువే. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారు మరెందరో. అలాగే, బైక్‌ రేసింగ్‌ జోరు ఇంకా ఎక్కువే. నిబంధనల్ని ఉల్లంఘించి తమ చేతికి చిక్కితే చాలు జరిమానాల మోతతో నడ్డి విరిచే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ముందుకు సాగుతున్నారు. తాజాగా మోటార్‌ వెహికల్‌ చట్టం అమల్లోకి రావడంతో జరిమానాల వడ్డనే కాదు, నిబంధనల అమలు మరింత కఠినం అయ్యాయి. ఇందుకు తగ్గట్టుగా చెన్నైలో అనేక మార్గాల్లో నిఘా నేత్రాల ఏర్పాటు చేశారు.  నేరగాళ్లను, ట్రాఫిక్‌ను, నిబంధనల్ని ఉల్లంఘించే వారిని పసిగట్టే రీతిలో ఈ నిఘా నేత్రాలు దోహదపడుతున్నాయి. కొన్ని మార్గాల్లో సేకరించిన సీసీ కెమెరాల దృశ్యాల మేరకు ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించకుండా ముందుకు సాగిన వారి భరతం కూడా పట్టారు.  

లైసెన్సులు రద్దు..జరిమానా జోరు... 
2019 జనవరి నుంచి డిసెంబరు నెలాఖరు వరకు ఒక్క చెన్నైలోనే ట్రాఫిక్‌ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులుగా ఉన్న వాహన చోదకులు, మందుబాబులు, జరిమానాల వడ్డన గురించిన వివరాలను చెన్నై ట్రాఫిక్‌ విభాగం మంగళవారం ప్రకటించింది. ఆ మేరకు పదే పదే నిబంధనల్ని ఉల్లంఘించిన లక్షా 30 వేల 559 మంది లైసెన్సులు రద్దు చేశారు. ఇందులో అతి వేగంగా వాహనాలు నడిపినందుకుగాను 73 వేల మంది లైసెన్సులు రద్దు అయ్యాయి. గతంతో పోల్చితే తాజాగా ప్రమాదాల సంఖ్య కొంత మేరకు తగ్గాయి. 2018లో 7549 ప్రమాదాలు చెన్నైలో జరగ్గా 1,260 మంది మరణించారు. తాజాగా 6,832 ప్రమాదాలు జరగ్గా 1,224 మంది మరణించారు. 2017తో పోల్చితే తాజాగా, మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. 2017లో మద్యం తాగి వాహనాలు నడిపి 25వేల మంది వరకు పట్టుబడ్డారు. 2018లో 40వేల మంది పట్టుబడగా, ప్రస్తుతం 51,900 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కారు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారి నుంచి రూ.29 కోట్ల 80 లక్షలు జరిమానాల రూపంలో వసూళ్లు చేశారు.   

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top