ఆన్‌లైన్‌ ప్రేమపెళ్లి మోసాలు

Online Wedding Cheatings In Karnataka - Sakshi

బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్న వైనం

ఆఫ్రికన్ల ఫేస్‌బుక్‌ వలలో యువతీ యువకులు

పరువు పోతుందని నమోదు కాని కేసులు

బొమ్మనహళ్లి: ఆన్‌లైన్‌ వివాహ సంబంధాలు యువతీ యువకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నాయి. బెంగళూరు మహా నగరంలో ఇటీవల ఇలాంటి నయ వంచన బారిన పడిన వారు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, పరువు పోతుందనే భయంతో గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోతున్నారు. ఇటీవల ఓ టెకీ రూ.60 లక్షలు పోగొట్టుకున్నాడంటే, ఈ పెళ్లి మోసం ఎంత తారస్థాయికి చేరిందో ఊహించు కోవచ్చు. ఆన్‌లైన్‌లో ఓ మోడల్‌ ఫొటోను చూసి, ఆమె తనను పెళ్లి చేసుకుంటుందనే నమ్మకంతో ఆ మొత్తాన్ని సమర్పించుకున్నాడు. ఇలా మోసపోయిన వారు పోలీసులకు మౌఖికంగా తప్ప, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదు. అలా చేస్తే...సమాజంలో నగుబాట్ల పాలవుతామని, ప్రస్తుత గ్యాసిప్‌ లోకంలో భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటామనే భయం వారిని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయించడం లేదు. గత ఏడాది 20 మంది మాత్రమే ఇలాంటి నయవంచన కేసుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఆ సంఖ్య దాటిపోయింది. వాస్తవానికి ఈ మోసం బారిన పడిన వారితో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువని సైబర్‌ క్రైమ్‌ పోలీసులే అంగీకరిస్తున్నారు.

ఎక్కడినుంచైనా మోసం చేయవచ్చు:...
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ మోసాలకు పాల్పడవచ్చు. మోసగాళ్లు భారతీయ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ఉంటారు. తద్వారా నగదు బదిలీకి ఎలాంటి అవాంతరాలుండవు. బాధితులను సంప్రదించడానికి లెక్కలేనన్ని సిమ్‌ కార్డులు వినియోగిస్తారు. ముఠాలోని మహిళ బాధితులతో తరచూ మాట్లాడడం ద్వారా వారిలో నమ్మకం  కలిగేలా చూస్తుంది.

నివారణోపాయాలు:....
ఫేస్‌బుక్‌లో అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్‌ రిక్వెస్టులను తిరస్కరించాలి. ఏకాంత దృశ్యాలతో కూడిన ఫొటోలను ఎవరితోనూ షేర్‌ చేయకూడదు. ఆన్‌లైన్‌లో సంప్రదించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయకూడదు. 

బాధితులంతా యువతీ యువకులే
బాధిత యువతీ యువకులు 19 నుంచి 35 ఏళ్ల వారే. ఈ మోసాలకు మూల స్థానాలు ఆఫ్రికా దేశాలు. వారంతా సాంకేతిక   కోవిదులే కాకుం డా, ఎవరినైనా కబుర్లతో మెల్లగా బుట్టలో పడేసే వాక్చాతుర్యం కలిగిన వారు కూడా. ఈ మొత్తం వ్యవహారంలో ఏ సందర్భంలోనూ వారు బాధితులకు ముఖాముఖి తారసపడరు. అసలీ వ్యవహారమంతా చాలా సరళంగా సాగిపోతుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. వారు చెబు తున్న ప్రకారం...ఈ మోసాలకు పాల్పడే వారంతా ముఠాలుగా ఉంటా రు. సాధారణంగా ఒక్కో గ్యాంగులో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉం టారు. ఢిల్లీ, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతీ యువకులతో ఆఫ్రికన్లు ముందుగానే ఒడంబడికలు కూడా చేసుకుని ఉంటారు. ఫేస్‌బుక్‌ లేదా వివాహ వేదికల సైట్లలో బాధితులను ఎంచుకుంటారు. బాధితుల్లో ఆర్థికంగా బాగా ఉన్న వారిని ఎంచుకుని చాటింగ్‌ మొదలెడతారు.

వీరిలో కూడా బాగా భావోద్వేగానికి లోనయ్యే వారిని చూసుకుని, డబ్బులు గుంజు కోవడం ప్రారంభిస్తారు. ఈ డబ్బులు లాక్కోవడంలో నమ్మదగిన కట్టు కథలు చెబుతారు. తీరా డబ్బులు తమ ఖాతాల్లోకి పడ్డాక, ఆ గ్యాంగు పత్తా లేకుండా పోతుంది. అప్పటికి కానీ బాధితునికి జ్ఞానోదయం కాదు. అప్పటికే బ్యాంకు ఖాతాలు కనీస నగదు నిల్వలతో వెక్కిరిస్తూ ఉంటాయి. మోసపోయిన వెంటనే బాధితులు తమను సంప్రదిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బాగా కాలయాపన చేసి తమ వద్దకు రావడం వల్ల మోసగాళ్లను పట్టుకోలేమని తెలిపారు. బాధితుల్లో చాలా మంది అవతలి వ్యక్తుల సంభాషణలను నిజమేనని భావించి, ప్రేమ అనే ఊహా లోకాల్లో విహరిస్తూ ఉంటారని చెప్పారు. వారెంత గుడ్డిగా మోస పోతారంటే...చాటింగ్‌ సాగిస్తున్న అవతలి వ్యక్తులు, ఫొటోల్లో తాము చూస్తున్న వారు వేర్వేరనే వాస్తవాన్ని ఏ సందర్భంలోనూ గుర్తించలేరని వివరించారు.

ఈ మోసాలు ఎలా ఉంటాయంటే...
సైబర్‌ పోలీసులు చెబుతున్న ప్రకారం.. ఒక పురుషుడు, స్త్రీ పేరు చెప్పుకుంటూ అవతలి పురుషునితో చాటింగ్‌ ప్రారంభిస్తాడు. ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ను ఉయోగించి బాధితుని వలలో వేసుకుంటాడు. సంభాషణలు చాలా శృంగారభరితంగా సాగుతాయి. ఇదే సమయంలో మార్ఫింగ్‌ ఫొటోలతో బాధితుని నమ్మించి, అతని ఏకాంత దృశ్యాల చిత్రాలను తీసుకుంటాడు. ఇక అంతే...డబ్బులు గుంజుకోవడం ప్రారంభమవుతుంది.    ఒక పురుషుడు, మరో మహిళతో వివాహ వేదిక సైట్‌లో సంప్రదిస్తాడు. చాటింగ్‌ కూడా మొదలవుతుంది. తాను విదేశాల్లో ఉంటానని, కళ్లు చెదిరే సంపాదన అని నమ్మబలుకుతాడు. ఎట్టకేలకు అతనితో వివాహానికి మహిళ సమ్మతిస్తుంది.

ముహూర్తం తేదీ కూడా ఖరారవుతుంది. పెళ్లికి కొద్ది రోజుల ముందు అతను ఆమెను ఫోనులో సంప్రదిస్తాడు. కస్టమ్స్‌లో దొరికిపోయానని, బయట పడడానికి కొన్ని లక్షలు అవసరమవుతాయని చెబుతాడు. కాబోయే వధువు వెంటనే తన బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేస్తుంది. డేటింగ్‌ సైట్లలో సంప్రదింపులు సాగించే జంట తక్కువ సమయంలోనే చాలా దగ్గరైపోతారు. విదేశాల నుంచి తానో కానుక పంపానని, అయితే అది కస్టమ్స్‌ అధికారుల వద్ద చిక్కుకుందని అతను ఆమెకు ఫోన్‌ ద్వారా తెలియజేస్తాడు. విమానాశ్రయంలో తమ మనిషి ఉంటాడని, అతనికి డబ్బు చెల్లిస్తే కానుకను విడిపించుకుని ఇస్తాడని నమ్మబలుకుతాడు. విమానాశ్రయంలో ముఠాకు చెందిన వ్యక్తి ఉంటాడు. అతను బాధిత మహిళ వద్ద డబ్బు తీసుకుని, తర్వాత కనబడడు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top