కాకానగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న దంపతుల మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ ఏదో ఒక నిర్ణయానికి రాలేమని పోలీసులు చెబుతున్నారు.
వీడని మరణాల మిస్టరీ
Published Sat, Oct 26 2013 11:12 PM | Last Updated on Thu, Jun 14 2018 4:21 PM
న్యూఢిల్లీ: కాకానగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న దంపతుల మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ ఏదో ఒక నిర్ణయానికి రాలేమని పోలీసులు చెబుతున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తేలాలంటే పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సిందేనంటున్నారు. పౌరసరఫరాల విభాగంలో కాస్ట్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్న కె. విజయ్ కుమార్(57), అతని భార్య సీతా(51) మృతదేహాలు కాకానగర్‌లోని వారి ఇంట్లో శుక్రవారం లభ్యమయ్యాయి. వారి కుమార్తె వరణ్య సాయంత్రం ఇంటికి తిరిగిరావడం, ఎంతకూ తల్లిదండ్రులు ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో స్థానికులు వాటిని బద్దలు కొట్టడంతో విషయం బయటపడింది. కుమార్ మెడపై గాయంతో రక్తపుమడుగులో పడి ఉండగా, సీతా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
ఈ విషయమై జాయింట్ కమిషనర్ వివేక్ గోగియా మాట్లాడుతూ... ‘భర్తను హత్య చేసి, సీతా ఉరేసుకుందా? లేక ఎవరైనా భర్తను చంపడంతో భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక భర్త కుమార్ ఏదైనా దారుణానికి ఒడిగట్టాడా? వంటి విషయాల్లో ఓ నిర్ణయానికి రావాలంటే పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉంటుంది. అయితే వారి బంధువులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నాం. హత్య జరిగిన ప్రాంతంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కూతురు వరణ్య స్నేహితులతో కలిసి రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాం. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ ఏదీ చెప్పలేమ’న్నారు.
Advertisement
Advertisement