దేశంలో అవినీతి పాలనను తరిమేసి, అభివృద్ధి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ క్రిష్ణ అద్వానీ పేర్కొన్నారు.
వేలూరు, న్యూస్‌లైన్: దేశంలో అవినీతి పాలనను తరిమేసి, అభివృద్ధి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ క్రిష్ణ అద్వానీ పేర్కొన్నారు. వేలూరులో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రచార సభకు అద్వానీ హాజరయ్యూరు. ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ అధ్యక్షతన దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని దేశంలోని అన్ని మీడియాలు, సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో పదేళ్లుగా అవినీతి పాలన సాగించిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ను ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే పోటీ ఉండేదని ప్రస్తుతం బీజేపీ కూటమితో పరిస్థితి మారిందన్నారు. రాష్ట్రంలోని విజయకాంత్, వైగో, రామదాస్, ఐజెకే వంటి కూటమి కొత్త చరిత్రను సృష్టించనుందన్నారు. తాను ఉప ప్రధానిగా పనిచేసిన కాలంలో విద్యాభివృద్ధి కోసం పలు పథకాలను తీసుకొచ్చానని గుర్తు చేశారు. అదే తరహాలో వేలూరు లోక్‌సభకు బీజేపీ కూటమి నుంచి పోటీచేస్తున్న ఎసి షణ్ముగం కూడా పేద విద్యార్థులకు విద్యను అందిస్తుండడం అభినందనీయమన్నారు. వేలూరులోని ప్రజా బలాన్ని చూస్తే షణ్ముగం విజయం సాధించి, జూన్‌లో బీజేపీ మంత్రి వర్గంలో చోటు సంపాదించి దేశంలోని అన్ని పథకాలను వేలూరుకు వర్తింప జేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గుజరాత్‌లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నరేంద్రమోడీ ఎంతో అభివృద్ధి చేశారని అదే తరహాలోనే దేశాన్ని కూడా అభివృద్ధి చేయగలిగే శక్తి సామర్థ్యాలున్నాయన్నారు.
తమిళ భాష అంటే ఎంతో ఇష్టం:
తనకు తమిళ భాష అంటే ఎంతో ఇష్టమని కానీ మాట్లాడలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు. తాను తొలిసారిగా తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్‌తోమాట్లాడానన్నారు. తాను చూసిన తమిళ సినిమా కూడా శివాజీదేనన్నారు. తాను 1952లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల నుంచి పార్టీలో పనిచేస్తున్నానని ప్రస్తుతం 16వ ఎన్నికల్లోను పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.
తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న మురళీధర రావ్
వేలూరు పార్లమెంట్ నియోజక వర్గంలో దాదాపు 30 శాతం తెలుగు ప్రజలు ఉండడంతో ప్రచార సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావ్ తెలుగులో ప్రసంగించారు. రాష్ర్టంలో ఎన్‌డీఏ కూటమి అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాత్రి వేళల్లో డబ్బులు పంచే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
అవకాశం కల్పించండి
వేలూరును అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశం కల్పించాలని బీజేపీ కూటమి అభ్యర్థి ఏసీ షణ్ముగం పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారులున్నాయంటే అందుకు బీజేపీనే కారణమన్నారు. కాంగ్రెస్‌లో అవినీతి పేరుకు పోయిందని ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలన్నారు. వేలూరులో ఐటీ పార్కు ఏర్పాటు చేసి 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఉచిత కల్యాణ మండ పాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అద్వానీ రాకను పురస్కరించుకుని వేలూరు ఎస్పీ విజయకుమార్ నేతృత్వంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుగా చెన్నై నుంచి వేలూరు వీఐటీ మైదానానికి హెలికాప్టర్‌లో అద్వానీ వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సభా స్థలికి చేరుకున్నారు. సభ ముగిసినానంతరం మళ్లీ వీఐటీ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్లర్‌లో తంజావూరు బయలుదేరి వెళ్లారు. తంజావూరులో తమ పార్టీ అభ్యర్థి కరుప్పు మురుగానందన్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో అద్వానీ ప్రసంగించారు.