బులెట్ రైలుకు ప్రాజెక్టుకు ఆదిలోనే బ్రేకు? | Mumbai-Ahmedabad bullet train project | Sakshi
Sakshi News home page

బులెట్ రైలుకు ప్రాజెక్టుకు ఆదిలోనే బ్రేకు?

Dec 18 2014 11:06 PM | Updated on Aug 15 2018 2:20 PM

ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ రైలు ప్రవేశపెట్టాలనే ప్రధాని నరేంద్ర మోదీ..

టెర్మినల్ నిర్మాణం కోసం స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే విముఖత

సాక్షి, ముంబై: ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ రైలు ప్రవేశపెట్టాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్న కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు. బులెట్ రైలు టెర్మినస్ నిర్మాణం కోసం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న స్థలమిచ్చేందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) సిద్ధంగా లేదు. దీంతో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రైల్వే మంత్రాలయ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ రైలు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన చాలా కాలం నాటిదే. అయినప్పటికీ కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

రైల్వే పరిపాలనా విభాగం బడ్జెట్‌లో బులెట్ రైలుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అంతేకాకుండా ప్రతిపాదిత బులెట్ రైలు ట్రేన్‌పై సాధ్యాసాధ్యాలు, అందుకయ్యే వ్యయం తదితర అంశాలపై నివేదిక ను రూపొందించే బాధ్యతలను రైట్ కన్సల్టెంట్, జపాన్ ఇంటర్నేషనల్ కో-అపరేషన్ ఏజన్సీలకు అప్పగించింది. ఈ మేరకు రూపొందించిన తుది నివేదిక ఇటీవల రైల్వే మంత్రాలయతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో ముంబై-అహ్మదాబాద్ వయా ఠాణే 495.5 కి.మీ. పొడవైన ఈ మార్గంపై రైలు పరుగులు తీయాలంటే స్టాండర్డ్ గేజ్ అవసరమని పేర్కొంది. బీకేసీ మైదానంలో  భూగర్భంలో 20 మీటర్ల పొడవైన టెర్మినల్ నిర్మించి అక్కడి నుంచి మెట్రో, పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలతో జోడించాలని నిర్ణయించింది. ఇందుకోసం బీకేసీలో ఉన్న స్థలమివ్వాలని   రైల్వే శాఖ కోరింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బులెట్ రైలు ప్రాజెక్టు విషయమై ఎమ్మెమ్మార్డీయేతో చర్చించారు.

అయితే ఈ ప్రతిపాదనను ఎమ్మెమ్మార్డీయే తిరస్కరించింది. తమ వైఖరిని కేంద్రంతోపాటు రైల్వే శాఖకు తెలియజేసింది. నగరంలో స్థలాల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీకేసీలో స్థలాన్ని ఇచ్చేందుకు అథారిటీ వెనకడుగు వేసింది. ఎమ్మెమ్మార్డీయేకి బీకేసీలోనే అత్యంత విలువైన స్థలాలున్నాయి. రైల్వే వద్ద కూడా సొంత స్థలాలున్నాయి. అందులోనే బులెట్ రైలు టెర్మినల్ ను నిర్మించుకోవాలని సూచించింది. తమ సొంత స్థలాలు ఇచ్చేందుకు వీలుపడదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. దీంతో ఇరు ప్రధాన నగరాల మధ్య ప్రవేశపెట్టనున్న బులెట్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన అటకెక్కే ప్రమాదం తలెత్తింది. అయినప్పటికీ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తే తప్ప ఈ ప్రాజెక్టు గాడినపడే అవకాశాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement