
‘లింక్’ తేలుస్తాం
ఐఎస్‌ఐఎస్ సంస్థ తరఫున ప్రచోదిత ట్వీట్‌లు నిర్వహిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన మెహ్ది నుంచి సమాచారాన్ని ......
మెహ్దీ ల్యాప్‌టాప్‌లో ఉన్న వివరాలను సేకరిస్తున్నాం : పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి
బెంగళూరు : ఐఎస్‌ఐఎస్ సంస్థ తరఫున ప్రచోదిత ట్వీట్‌లు నిర్వహిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన మెహ్ది నుంచి సమాచారాన్ని సేకరించేందుకు గాను విచారణను వేగవంతం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మెహ్ది నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెహ్ది ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న అనంతరం మెహ్దికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు.
మెహ్ది పోలీస్ కస్టడీ ఈనెల 18తో ముగియనుందని, అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. అవసరమైతే మరికొన్ని రోజులు మెహ్దిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. ట్విట్టర్ ద్వారా మెహ్ది ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడనే విషయమై ట్విట్టర్ సంస్థ వద్ద పూర్తి సమాచారం ఉందని, తాము నోటీసులు ఇచ్చిన తర్వాత సంస్థ ప్రతినిధులు తమకు అనుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు. ఇక మెహ్దిని స్వయంగా కమిషనర్ ఎంఎన్ రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్‌లే స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో మెహ్దీ విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది.