
పోలీసులు ప్రశ్నించే వేళ న్యాయవాది ఉండటం సబబేనా?
మీ స్పందనేంటో తెలపండి
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్‌పై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు కేసు విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించే వేళ పిటిషనర్ తరఫు న్యాయవాదులు అక్కడే ఉండొచ్చా? అనే ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రాబట్టదల్చుకుంది. ఇందుకోసం ఈ అంశంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
రాజ్యాంగంలోని 20(3), 21, 22 అధికరణాల ప్రకారం సంక్రమించిన హక్కులమేరకు కేసుల విచారణ సందర్భంలో వ్యక్తులు తమ న్యాయవాదులను పోలీసులు, ఇంటరాగేషన్ అధికారుల సమక్షంలో హాజరుపర్చవచ్చని, ఈ మేరకు అనుమతి మంజూరుచేయాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం న్యాయవాది షరీఫ్ మధార్ వేశారు. ఈ పిల్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం బుధవారం విచారించింది.
లాయర్ మధార్ తరఫున సీనియర్ మహిళా న్యాయవాది మేనకా గురుస్వామిని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రన్ ప్రశ్నించారు. ‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రశ్నించేటప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్లు భౌతికంగా హింసకు గురైన ఘటనలు ఉన్నాయా? దర్యాప్తు వేళ లాయర్లు తప్పనిసరిగా ఉండాలా?’’అని ప్రశ్నించారు. దీంతో లాయర్ ‘ఇండియా: హింసా సంబంధ 2019 వార్షిక నివేదిక’ను గుర్తుచేశారు.
‘‘పోలీస్, దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నప్పుడు పిటిషనర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వేదన అంశాలను నివేదిక సవివరంగా వివరించింది. నేరాన్ని ఒప్పుకునేలా చేసేలా ప్రశ్నలు వేస్తే వాటిని లాయర్ సాయంతో పిటిషినర్ గుర్తించేందుకు, చేయని నేరాన్ని పొరపాటున ఒప్పుకున్నట్లు సమాధానాలు ఇచ్చే ప్రమాదకర స్థితిని లాయర్ తప్పించగలరు. ప్రస్తుతం లాయర్లను చాలా వరకు విచారణవేళ నిరాకరిస్తున్నారు.
ఒకవేళ అనుమతించినా దూరంగా కూర్చోబెడుతున్నారు. తమ పిటిషనర్‌ను ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారనేది లాయర్ వినిపించట్లేదు. పోలీసులు చేసే స్వీయ నేరాంగీకార ప్రయత్నాన్ని అడ్డుకునేలా పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ద్వారా సంక్రమించిన హక్కు ఉల్లంఘనకు గురవుతోంది. ఆర్టికల్ 22(1) ప్రకారం తన లాయర్ ద్వారా తనను తాను రక్షించుకునే, లాయర్ సలహాలు తీసుకునే హక్కులూ ఉల్లంఘనకు గురవుతున్నాయి’’అని లాయర్ వాదించారు.