నోరు జారారు.... క్షమించమన్నారు! | master hirannaiah said sorry to siddaramaiah, | Sakshi
Sakshi News home page

నోరు జారారు.... క్షమించమన్నారు!

May 12 2014 2:37 AM | Updated on Mar 18 2019 7:55 PM

నోరు జారారు.... క్షమించమన్నారు! - Sakshi

నోరు జారారు.... క్షమించమన్నారు!

ప్రముఖ నాటక రంగ కళాకారుడు మాస్టర్ హిరణ్ణయ్య నోరు జారారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అశ్లీల పద ప్రయోగం చేసి నాలుక్కరుచుకున్నారు.

 సాక్షి, బెంగళూరు : ప్రముఖ నాటక రంగ కళాకారుడు మాస్టర్ హిరణ్ణయ్య నోరు జారారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అశ్లీల పద ప్రయోగం చేసి నాలుక్కరుచుకున్నారు. వివరాలు పరిశీలిస్తే.... మైసూరులో ఆదివారం ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిరణ్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మొదలుపెట్టారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురించి అవహేళనగా మాట్లాడుతూ అశ్లీల పద ప్రయోగాన్ని చేశారు. దీంతో సభలో ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరులు, సిద్ధు అభిమానులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. వేదికపై ఎక్కి వీరంగం సృష్టించారు. అంతేకాదు రోడ్డుపై బైఠాయించి హిరణ్ణయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.

ఈ క్రమంలో హిరణ్ణయ్య ముందుగా మీడియా ద్వారా సిద్ధరామయ్యకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, వృద్ధాప్యం కారణంగా ఏదో అనబోయి ఇంకేదో అన్నానని తెలిపారు. అయినా హిరణ్ణయ్యకు వ్యతిరేకంగా నిరసనలు ఆగకపోడంతో మైసూరులోనే ఉన్న సీఎం సిద్ధరామయ్యను స్వయంగా కలుసుకొని హిరణ్ణయ్య క్షమాపణలు చెప్పుకున్నారు. ‘ఈ సందర్భంగా నన్ను క్షమించండి, కావాలని మీ గురించి అలా అనలేదు’ అని వివరణ ఇచ్చారు. ఇదంతా విన్న సీఎం సిద్ధరామయ్య ‘జరిగిందేదో జరిగిపోయిందిగా మీరూ క్షమాపణ చెబుతున్నారు, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం’ అని అన్నారు. అనంతరం హిరణ్ణయ్యను ఆయన కారు వరకు తీసుకొచ్చి వీడ్కోలు పలికారు. దీంతో ఆందోళన కారులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement