ఈ ఏడాది 61 వేల పోలీసు ఉద్యోగాలను ఐదు విడతల్లో భర్తీ చేస్తామని హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వెల్లడించారు.
సాక్షి, ముంబై: ఈ ఏడాది 61 వేల పోలీసు ఉద్యోగాలను ఐదు విడతల్లో భర్తీ చేస్తామని హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వెల్లడించారు. ఠాణేలో రూ.11కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఠాణే పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఆయన ఇటీవల ప్రారంభించారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ‘హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (హుడ్కో) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ నిధుల ద్వారా పోలీసు స్టేషన్ భవనాల ఆధునీకరణ పనులు కూడా చేపడతామని వివరించారు.
కొత్తగా నిర్మించే ఇళ్లతోపాటు పాత, శిథిలావస్థకు చేరుకున్న పోలీసు క్వార్టర్స్ భవనాలకు మరమ్మతులు చేపడతామన్నారు. ఠాణే సిటీలో చితల్సర్, ఖడక్‌పాడా, దాపోడే ప్రాంతాల్లో మూడు కొత్త పోలీసు స్టేషన్లు, జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఐదు పోలీసు స్టేషన్లు నిర్మించనున్నామని పాటిల్ తెలిపారు. వీటిద్వారా పోలీసు శాఖ మరింత పటిష్టమవడంతో నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందన్నారు. అదనంగా అందుబాటులోకి వచ్చే ఈ పోలీసు స్టేషన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిన అత్యాచారాలు, గొలుసు దొంగతనాలను అరికట్టవచ్చని అన్నారు.