తల్లీ కొడుకును కలిపిన లాక్‌డౌన్‌..

Lockdown Unites Mother And Son In Tamil nadu - Sakshi

పెరంబూరు : అననుకూల పరిస్థితులు ఒక్కోసారి మంచి చేస్తాయి.. అలాంటి తాజా పరిస్థితి ఒక కొడుకును తల్లి వద్దకు చేర్చింది. అదే లాక్‌డౌన్‌. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది 15 ఏళ్ల క్రితం విడిపోయిన ఒక తల్లీకొడుకును మళ్లీ కలిపింది. విరుదునగర్‌ జిల్లా, సాంత్తూర్, నందవనపట్టి వీధిలో లక్ష్మి నివశిస్తోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. పౌష్టికాహార సమాఖ్య సభ్యురాలైన లక్ష్మి భర్త మరణించడంతో ఆర్థిక సమస్యల కారణంగా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేక పనికి పంపించింది. కొడుకుల్లో మూడో వాడైన పాండిరాజన్‌(33) సినిమాల్లో నటించాలన్న ఆశతో తల్లికి చెప్పకుండా చెన్నైకి వచ్చాడు.

నటుడిగా ఇతను చేసిన ప్రయత్నాలు ఫలించక జీవనాధారం కోసం పాత పేపర్ల దుకాణంలో పనికి చేరాడు. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనిలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన తల్లి గుర్తుకొచ్చి వెంటనే చెన్నై నుంచి సాంత్తూర్‌కు కాలిబాట పట్టాడు. గత 11వ తేదీన బయలు దేరాడు. మధ్య మధ్యలో లారీలు వంటివి ఎక్కి, మొత్తం మీద 17వ తేదీ రాత్రికి సొంత ఊరుకు చేరుకుని తల్లిని కలుసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లి పోయిన కొడుకు తిరిగి రావడంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. ఆ ప్రాంత ప్రజలు కరోనా టెస్ట్‌లు చేయించమని సలహా ఇవ్వడంతో పాండిరాజన్‌ను సాంత్తూర్‌లోని ఆరోగ్య శిబిరానికి తీసుకెళ్లింది. అతన్ని పరీక్షించిన వైద్యులు కరోనా వ్యాధి సోకలేదని నిర్ధారించారు.

చదవండి : పురుడు పోసిన సినీ రచయిత

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top