
అమ్మ సంతలు
జైలు, బెయిల్‌తో సతమతమవుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వెనక్కుతగ్గక తప్పదని భావించిన వారికి అధికార పార్టీ ఝలక్ ఇచ్చిం ది.
జైలు, బెయిల్‌తో సతమతమవుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వెనక్కుతగ్గక తప్పదని భావించిన వారికి అధికార పార్టీ ఝలక్ ఇచ్చిం ది. అమ్మపేరుతో సంతలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో పడింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే, డీఎంకేలు ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని పంచుకునే విధానానికి స్వస్తి పలకాలని అమ్మ ఆశిస్తోంది. భారీ పథకాల ద్వారా కొందరికే అందుబాటులో ఉండకుండా సామాన్యునికి చేరవయ్యేలా పథకాలను రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమ్మ (జయలలిత) పేరిట తమిళనాడులో అనే క పథకాలు వెలిశాయి. అతి స్వల్ప ధరకే టిఫిన్, భోజనం అందించే అమ్మ క్యాంటీన్ అత్యంత ప్రజాదరణ చూరగొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సైతం అమ్మ క్యాంటీన్‌ను అనుసరించాయి. దీంతోపాటూ అమ్మ ఫార్మశీ, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, అమ్మ స్టోర్లు ఇలా అనేక పథకాలు ప్రజలకు చేరువయ్యూయి. ఆహారం, ఆరోగ్యంతోపాటూ వినోదం కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఆఖరుకు చెన్నైలో అమ్మ థియేటర్లు సిద్ధమవుతున్నాయి. అతితక్కువ ధరకు ఐమాక్స్ స్థాయి థియేటర్లను పేద ప్రేక్షకుల కోసం నిర్మిస్తున్నారు. వరుసగా ప్రజలకు పరిచయం అవుతున్న ఈ పథకాలను ప్రవేశపెట్టేపుడు జయ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు జైలు శిక్షపడటం, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం, బెయిల్‌పై వచ్చి ఇంటికే పరిమితం కావడంతో అమ్మ పథకాలు ఆగిపోయాయని ప్రతిపక్షాలు భావించాయి. అయితే అమ్మ థియేటర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఇటీవలే ప్రకటించిన చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరస్వామి అమ్మ సంతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. కార్పొరేషన్ పరిధిలో 15 చోట్ల అమ్మ సంతలను నిర్వహించాలని నిర్ణయించినట్లు గురువారం ప్రకటించారు. కూరగాయలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు ఇలా మొత్తం 1256 రకాల వస్తువులను 50 శాతం ధరకే సంతలో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో లభ్యమయ్యే వస్తువులతోపాటూ దేశం నలుమూలల నుంచి విశేషమైన వస్తువులను అమ్మకానికి పెడతామని తెలిపారు.
రాష్ట్రంలోని 16,564 గ్రామాల ద్వారా వ్యాపారులు దుకాణాలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంతలో దుకాణాలు పెట్టేందుకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వ్యాపారస్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. వ్యాపారులకు ఉచిత పాస్‌లు అందజేస్తారు. ఒక్కో దుకాణాన్ని 100 చదరపు అడుగులకు సిద్ధం చేస్తూ మొత్తం 200 దుకాణాలు అమరేలా నిర్ణయించారు. తొలి దశలో ఆరుంబాక్కం, సాలిగ్రామం, వలసరవాక్కం, ఆర్కాడురోడ్డు, టైడల్‌పార్క్ సమీపం, నందంబాక్కం ఈ 6 చోట్ల సంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంతల ఏర్పాట్ల కోసం చెన్నై కార్పొరేషన్ రూ.11 కోట్ల బడ్జెట్ కేటాయించింది. వస్తువుల అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.3,600 కోట్ల టర్నోవర్‌ను అంచనావేశారు. చెన్నై కార్పొరేషన్ నిర్వహించే ఈ సంతలకు 41 ప్రభుత్వ శాఖల నుంచి సహకారం అందుతుంది.