చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని.. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.
డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.
ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు.


