సాక్షి, చైన్నె : గంజాయి అమ్మకాల వివాదం ఇరు వర్గాల మధ్య భగ్గుమంది. పల్లావరంలో ఇద్దరు దారుణ హత్యకు గురి అయ్యారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాలు.. చైన్నె శివారులోని తాంబరం సమీపంలోని ముడిచ్చూరుకు చెందిన అర్ముగం, అతని స్నేహితుడు సతీష్ (18) ఇద్దరూ రౌడీ షీటర్లు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉండటంతో, వీరిద్దరూ గత కొన్ని రోజులుగా పల్ల్లావరం సమీపంలోని త్రిశూలం, తులసింగ మొదలియార్ వీధిలో ఉన్న తమ బంధువుల ఇంట్లో తలదాచుకుని ఉన్నారు. ఈ పరిస్థితులలో ఆదివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ముఠా ఆ ఇంట్లోకి చొరబడింది. కొడవళ్లతో వీరంగం సృష్టించింది. ప్రాణభయంతో పారిపోవడానికి ప్రయత్నించిన అర్ముగం, సతీష్‌లను వెంటాడి వేటాడి మరీ నరికి చంపారు. వారి ముఖాలను ఎవ్వరుగుర్తు పట్ట లేనంతగా అతి దారుణంగా ఛిద్రం చేసి అక్కడి నుంచి ఆ ముఠా ఉడాయించింది.
హత్యకు గల కారణాలు..
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మృతదేహాలను క్రోంపేట జీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ జంట హత్యకు గంజాయి విక్రయాల వివాదమే కారణమని తేలింది. గంజాయి అమ్మకాల విషయంలో అర్ముగం ముఠౠకు, అదే ప్రాంతానికి చెందిన దీపక్ ముఠాకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం దీపక్ ఇంటిపై అర్ముగం ముఠా దాడి చేసింది.ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని దీపక్ ముఠా పథకం వేసింది. ఆర్ముగం త్రిశూలం వద్ద ఉన్నట్టు పక్క సమాచారంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. గత ఏడాది పెరుంగళత్తూరు శ్మశానవాటికలో జరిగిన ఒక హత్య కేసులో కూడా ఈ ముఠాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దీపక్, అతని అనుచరుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ జంట హత్యలతో పల్ల్లావరం, త్రిశూలం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
సంఘటన స్థలం, (ఇన్‌సెట్) ఆర్ముగం


